Husband Cheating Wife in Telugu : ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం కామన్ అయిపోయింది. దీనివల్ల భార్యభర్తలు ఎక్కువ సమయం ప్రేమగా గడపలేకపోతున్నారు. వారి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, వంటి కారణాల వల్ల బంధంలో దూరం పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు మరో వ్యక్తికి దగ్గరవుతున్నారు. దీనివల్ల అన్యోన్యమైన దాంపత్యంలో చిక్కులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఓ మహిళకు ఎదురైంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య :
'మా పెళ్లై పదేళ్లు అవుతోంది. మాకో పాప. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. రోజూ ఆఫీస్కు వెళ్లడం, ఇంటికి రావడంతో ఇద్దరం బిజీ అయిపోయాం. దీనివల్ల మా మధ్య ఎమోషనల్ బంధం తగ్గిపోయింది. ఈ క్రమంలోనే మా ఆయనలో చాలా మార్పు గమనించా. ఓ రోజు ఆయన నా దగ్గరకొచ్చి అకస్మాత్తుగా ఏడవడం మొదలుపెట్టారు. తప్పు చేశాననీ, వేరే అమ్మాయితో దగ్గరయ్యాననీ అన్నారు. అతనితో విడిపోదామంటే పాప గుర్తుకొస్తోంది. కానీ, ఒకసారి నన్ను మోసం చేసినవారు, ఇంకోసారి చేయరు అన్న గ్యారెంటీ లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. మా ఆయనకి రెండో అవకాశం ఇవ్వొచ్చా?' అని ఓ మహిళ మానసిక నిపుణుల సలహా కోరుతోంది. ఈ సమస్యకు ప్రముఖ మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి ఆన్సర్ ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంత్రికంగా మారిపోతుంది!
ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ జాబ్స్ చేస్తున్నారు. దాంతో కొంతమంది కుటుంబానికీ, కెరియర్‌కీ సమయాన్ని సరిగ్గా విభజించుకోలేరు. దానివల్ల జీవితం యాంత్రికంగా మారిపోతుంది. మీరిద్దరూ ఎక్కువ సమయం గడపలేకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగానూ దూరమవుతున్నారు. అయితే, ఇదే సమయంలో కొందరు తెలియకుండానే ఇతరుల ఆకర్షణలకు లోనవుతున్నారు. ఇది మొదట ఫ్రెండ్షిప్గా మొదలై ఆ తర్వాత అన్ని విధాలుగానూ దగ్గరవుతుంటారు. మీ ఆయన విషయంలోనూ అదే జరిగింది.
"దాంపత్య జీవితమనేది భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం అనే పునాదులపై నిర్మితమవుతుంది. మీ విషయంలో జరిగినది తట్టుకోలేనిది. అయితే, మీ ఆయనతో విడాకులు తీసుకోవడం సులభమే. కానీ, దాని తర్వాత భవిష్యత్తులో పాపని పెంచడంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాపకి మీ ఇద్దరి ప్రేమా, సంరక్షణా అవసరం అవుతాయి." డాక్టర్ మండాది గౌరీదేవి, మానసిక నిపుణురాలు
పాప నలిగిపోతుంది :
ఒకవేళ మీరు ఆయనతో కలిసి ఉండకుండా విడాకులు తీసుకుంటే పాప ఇద్దరి మధ్యలో నలిగిపోతుంది. దానివల్ల మీరు విడిగా ఉన్నా కూడా ఇద్దరూ సంతోషంగా జీవితం గడపలేరు. కాబట్టి, మీరు ఫ్యామిలీ కౌన్సెలర్ హెల్ప్ తీసుకోండి. వాళ్లు మీ మానసిక, సామాజిక, కుటుంబ పరిస్థితులను విశ్లేషించి, సలహాలు అందిస్తారు. బంధం బలపడేలా కొన్ని సూచనలు చేస్తారు. మీ ఆయన కూడా తప్పుని అంగీకరించాడు. పశ్చాత్తాప్పడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే, మరో అవకాశం ఇచ్చి చూడండి. ఇక నుంచి మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండని డాక్టర్ మండాది గౌరీదేవి చెబుతున్నారు.
'అప్పుడు కట్నం తీసుకున్నాడు, ఇప్పుడు పొలంలో వాటా ఇవ్వాలంటున్నాడు!'
'లవ్ మ్యారేజ్ చేసుకున్నాక భర్త, అత్తమామలు కులం పేరుతో వేధిస్తున్నారు!' - నేను ఏం చేయాలి?