How To Make Maramarala Vada Recipe :వడలు అంటే చాలా మందికి ఇష్టం. ఎక్కువ మంది బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తింటుంటారు. ఇక వడలు తినాలనుకున్నవారు హోటల్స్‌కు వెళ్తే.. మరికొద్దిమంది వీటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఇక వీటిని ఇంట్లో తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. మినపప్పు నానబెట్టాలి.. దాన్ని రుబ్బుకోవాలి.. ఆ తర్వాత వడలు వేసుకోవాలి. అయితే ఇకపై వడలు తినాలనిపిస్తే గంటల గంటలు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇంట్లో మరమరాలు ఉంటే కేవలం నిమిషాల్లోనే వడలు చేసుకోవచ్చు. ఏంటి నమ్మడం లేదా? మీరు విన్నది నిజమే. మరమరాలతో ప్రిపేర్ చేస్తే కేవలం నిమిషాల్లోనే మీ ప్లేట్లోకి వేడివేడి వడలు వచ్చేస్తాయి. అంతేనా టేస్ట్ మినప వడలను మించి ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
- మరమరాలు - 3 కప్పులు
- నీళ్లు - 3 కప్పులు
- అల్లం పేస్ట్ - టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ - 1
- కరివేపాకు - 1
- పచ్చిమిర్చి -2
- కొత్తిమీర - కొద్దిగా
- జీలకర్ర - టీస్పూన్
- మిరియాల పొడి - టీస్పూన్
- బియ్యం పిండి - అరకప్పు
- పెరుగు - అరకప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె- వడలు వేయించడానికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా మరమరాలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి ఓ పది నిమిషాలు పక్కకు పెట్టాలి.
- ఈ లోపు.. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
- తర్వాత నానిన మరమరాలను నీళ్లు లేకుండా పిండుకుంటూ ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మరమరాలను మొత్తం తీసుకోవాలి.
- ఇప్పుడు వాటిని చేతితో మెదుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి. మరమరాలు పూర్తిగా మెత్తగా కాకపోయినా కొన్ని అలా ఉన్న గారెలు రుచికరంగానే ఉంటాయి.
- తర్వాత ఇందులోకి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
- అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్లీ కలపాలి. తర్వాత పెరుగు, బియ్యం పిండి వేసి వడల పిండిలా కలుపోవాలి. పిండి మరీ జారుగా, గట్టిగా కాకుండా నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోండి.
- ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని వడలుగా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి.
- రెండువైపులా వడలను దోరగా వేయించుకుంటే సరిపోతుంది. వేడివేడి ఎంతో రుచికరమైన వడలు మీ ముందుంటాయి.
- చాలా సింపుల్‌గా త్వరగా రెడీ అయ్యే మరమరాల వడల రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో చేసేయండి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.