How to Make Delhi Special Bedmi Poori :బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మందికి పూరీ ఫేవరెట్. ఈ పూరీలను టిఫెన్‌గా మాత్రమే కాకుండా స్నాక్స్‌గా, ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు, పండగ సందర్భాల్లో కూడా చేస్తుంటారు. ఇక సాధారణంగా పూరీలు అంటే గోధుమపిండి, మైదాతో చేసినవి మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ.. వేరే పదార్థాలతో కూడా చేసుకోవచ్చు. అందులో మినపప్పుతో చేసేవి కూడా ఉంటాయి. ఏంటీ మినపప్పుతో పూరీలా? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మినపప్పుతో చేసే ఈ పూరీలు చాలా బాగుంటాయి. దిల్లీలో ఇది యమా ఫేమస్. ఇందులోకి కాంబినేషన్‌గా ఆలూ కర్రీ కూడా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా దిల్లీ స్పెషల్ మినపప్పుతో చేసే బెడ్మీ పూరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా..
బెడ్మీ పూరీకి కావాల్సిన పదార్థాలు :
- రెండు గంటలు నానబెట్టిన మినపప్పు - పావు కప్పు
- పచ్చిమిర్చి - 2
- దంచిన సోంపు పొడి - అర టీ స్పూన్
- ఇంగువ - 2 చిటికెళ్లు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్(ఆప్షనల్)
- కారం- అర టీ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - పావు టీ స్పూన్
- ధనియాల పొడి - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- గోధుమ పిండి - 1 కప్పు
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన మినపప్పు, పచ్చిమిర్చి, సోంపు పొడి, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి ఇడ్లీ రవ్వ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా.. మరీ బరకగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఓ బౌల్లో గోధుమపిండి తీసుకుని అందులోకి ఒకటిన్నర టీ-స్పూన్ నూనె పోసి గ్రైండ్ చేసుకున్న మినపప్పు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా వత్తుకుంటూ గట్టిగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత పైన కొద్దిగా నూనె రాసి మూత పెట్టి అరగంట పక్కకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండి కాస్త మెత్తబడుతుంది.
- ఈ లోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత పిండిని నిమ్మకాయ సైజంతా ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కో ఉండ తీసుకుని నూనె అప్లై చేస్తూ పూరీల్లా వత్తుకోవాలి.
- ఇలా చేసిన పూరీలను బాగా కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
- అంతే ఎంతో టేస్టీగా ఉండే దిల్లీ స్పెషల్ బెడ్మీ పూరీ రెడీ. దీన్ని నార్మల్‌గా తిన్నా పూరీ కర్రీతో తిన్నా అద్దిరిపోవాల్సిందే.