How to Iron Pattu Sarees at Home:మహిళలకు పట్టు చీరలంటే చాలా ఇష్టం. కొందరు కట్టుకోవడానికి ముందు, తర్వాతా పట్టుచీరలకు ఐరన్ చేస్తుంటారు. అలా అని కేవలం పట్టు చీరలుమాత్రమే కాకుండా కాటన్ దుస్తులకు కూడా ఐరన్ అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది ఈ దుస్తులు ఇంట్లో ఐరన్ చేస్తే సరిగ్గా రాక చెడిపోతాయని భయపడి.. బయట డ్రై క్లీనింగ్ షాపులకు ఇస్తుంటారు. కానీ ఈ పద్ధతులు పాటిస్తే ఇంట్లోనే ఈజీగా వాటిని ఐరన్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కాటన్ దుస్తులు ఎలా ఐరన్ చేయాలి?:కాటన్ దుస్తులను ఐరన్ చేయడానికి ముందుగా వాటిపై నీళ్లు చల్లాలి. ఇలా చేయడం వల్ల క్లాత్ మృదువుగా మారుతుందని.. ఐరన్ చేయడం సులభం అవుతుందని తెలుపుతున్నారు. ఇంకా కాటన్ దుస్తులు ఐరన్ చేయడానికి ముందు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచకూడదని సూచిస్తున్నారు. టెంపరేచర్ ఎక్కువ అయితే దుస్తులు దెబ్బతిని, కాలిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా కాటన్ దుస్తులను తిరగేసిన తర్వాత ఐరన్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.
పట్టుచీరలను ఐరన్ చేయడం ఎలా?:మహిళలు పట్టు చీరలపట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అయితే, ముఖ్యంగా ఐరన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. పట్టు చీరపై నేరుగా ఐరన్ బాక్స్ పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు. ముందుగా పట్టు చీరపై ఓ పలుచటి వస్త్రం లేదా టిష్యూ పేపర్‌ను ఉంచి ఐరన్ చేయాలని సూచిస్తున్నారు. పట్టు చీరను ఐరన్ చేసేటప్పుడు ఉష్ణోగ్రత తక్కువగా ఉంచాలని సలహా ఇస్తున్నారు. ఇలా కాకపోతే ఆవిరి సహాయంతో కూడా పట్టు దుస్తులను ఐరన్ చేయవచ్చని అంటున్నారు. ఇలా చేయడం వల్ల పట్టు దుస్తులు మృదువుగా మెరుస్తూ ఉంటాయని వివరించారు.