Greasy Hair Treatment Home : కొందరి జుట్టు ఎల్లప్పుడూ జిడ్డుగానే కనిపిస్తూ ఉంటుంది. తలస్నానం చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండదు. హెడ్ బాత్ చేసిన మరుసటి రోజు నుంచే జిడ్డుగా మారిపోతుంది. దురద, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా ఇబ్బందిపెడుతుంటాయి. దీంతో వారు బయటకు కూడా వెళ్లలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? అని అనేక విధాలుగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే సమస్యలకు పరిష్కార మార్గాలను వివరించారు ప్రముఖ సౌందర్య నిపుణులు శైలజ సూరపనేని. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాడుపై ఎక్కువగా నూనెలు విడుదలవ్వడం వల్ల ఇలా జిడ్డుగా మారుతుందని చెప్పారు ప్రముఖ సౌందర్య నిపుణులు శైలజ సూరపనేని. దురద, గులాబీ రంగులోకి మారడం, తలపై చర్మమంతా పొట్టులా రాలడం లాంటివి కనిపిస్తే చుండ్రు లేదా సెబోరిక్ డెర్మటైటిస్ అనీ అంటారని తెలిపారు. దీనివల్ల కొందరిలో నుదుటిపై యాక్నే కూడా వస్తుందని చెప్పారు. కాలుష్యం, రసాయనాలతో కూడిన షాంపూలు, ఉత్పత్తులు వాడటం వల్ల మాడు పొడిబారి, అలర్జీలతోపాటు వెంట్రుకలు విపరీతంగా రాలతాయన్నారు. ఈ క్రమంలోనే ఈ సమస్యను తగ్గించేందుకు పలు చిట్కాలను శైలజ సూరపనేని చెప్పారు. అవేంటో తెలుసుకుందాం.
- ఈ సమస్యను తగ్గించడంలో కలబంద బాగా సాయపడుతుంది. దీని గుజ్జును తలకు పట్టించి, కాసేపయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది.
- కొబ్బరినూనెలో కొన్నిచుక్కలు టీట్రీ ఆయిల్ లేదా నిమ్మరసం కలపండి. తలస్నానం చేశాక చెంచా యాపిల్ సిడార్ వినెగర్‌ను మగ్గు నీటిలో కలిపి, తలమీద పోసుకోవాలి.
- రాళ్ల ఉప్పుకు నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపి, తడి తలకు మర్దనా చేయండి.
- బేకింగ్ సోడాని తడి తలకు పట్టించి, బాగా రుద్ది, షాంపూతో కడగాలి.
- వేపాకును నీటిలో మరిగించి, ఆ నీటితో తలస్నానం చేయాలి.
- సోడియం లోరల్ సల్ఫేట్, సెలీనియం సల్ఫైడ్, బెంజాల్ పెరాక్సైడ్, కీటాకొనజాల్, సెల్ఫాసెటమైడ్ ఉన్న షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.
- షాంపూ పెట్టుకున్నాక ఎక్కువ నీటితో కడగాలి. కండిషనర్ వాడుతూనే హెయిర్ డ్రైయ్యర్, ఐరనింగ్ వంటివాటికి దూరంగా ఉండాలి.
- వాడే దువ్వెనలనూ తరచూ శుభ్రం చేసుకోవాలి.
- వాటర్ బేస్‌డ్ షాంపూలనే వాడండి.
- జుట్టు ఆరాకే జడ వేసుకోవాలి.
- ఎండలోకి వెళ్లొచ్చినా, వ్యాయామం చేసినా చెమట బాగా పడితే తలస్నానం తప్పనిసరిగా చేయాలి.