Furniture Cleaning : ఫర్నిచర్ ఇంటికి హుందాతనాన్ని తీసుకొస్తే.. వాటి శుభ్రత కొత్త శోభను తీసుకొస్తుంది. అందుకే.. తరుచూ వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు. అలా ఉండాల్సిందే. అయితే.. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకసారి వాటిపై మరకలు పడుతూనే ఉంటాయి. కొన్ని మరకలను వదిలించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరికొన్ని మొండిగా ఉండిపోతాయి. ఇలాంటి వాటిని కూడా చాలా ఈజీగా తుడిచిపారేయొచ్చు. మరి, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
లిక్విడ్ బ్లీచ్ :చెక్కతో తయారు చేసిన ఏ ఫర్నిచర్‌పైన అయినా, ఎలాంటి మరక పడినా.. లిక్విడ్ బ్లీచ్‌తో చాలా ఈజీగా తొలగించొచ్చు. దీనికోసం ఒక పాత టూత్‌బ్రష్‌ను తీసుకొని, ఆ లిక్విడ్ బ్లీచ్‌లో ముంచండి. ఇప్పుడు మరకపై స్మూత్‌గా రుద్దండి. ఆ తర్వాత కొన్ని నిమిషాలపాటు అలా వదిలేయండి. ఇప్పుడు మెత్తటి పొడి క్లాత్‌తో తుడిచేయండి. అంతే.. మరక మొత్తం తొలగిపోతుంది.
ఫర్నిచర్ వ్యాక్స్ :దాదాపుగా ఫర్నిచర్ మీద పడే మరకలు ఏవైనా నీటి వల్లనే ఏర్పడతాయి. వాటిని ఈజీగా క్లీన్ చేయడానికి ఫర్నిచర్ వ్యాక్స్ చక్కగా ఉపయోపడుతుంది. కాస్త ఫర్నిచర్ వ్యాక్స్ తీసుకొని, ఆ మరకపై రాసి ఒక మెత్తని క్లాత్‌తో తుడిచేయండి.
టూత్‌పేస్ట్ :డైనింగ్ టేబుల్ పైన గిన్నెలు, గ్లాసులు పెడుతుంటాం. వాడి అడుగు భాగాన తడి ఉండడవల్ల వాటి షేప్‌లో నీటి మరకలు, కర్రీ మరకలు ఏర్పడతాయి. ఇలాంటి వాటిని తొలగించడానికి టూత్‌పేస్ట్ సరిపోతుంది. దీనికోసం కాస్త పేస్టు తీసుకొని, దానికి నీటి చుక్కల్ని యాడ్ చేస్తూ.. పలుచగా అయ్యేదాకా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పేస్టును మరకపై పూసి, కొద్ది నిమిషాల వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేయాలి. ఈ చిట్కా ద్వారా డైనింగ్ టేబుల్ మాత్రమే కాకుండా.. తలుపులు, కిటికీలపై పడిన నీటి మరకల్ని కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు.
ఇంకా మరికొన్ని పద్ధతులు..
- ఒక కప్పు చల్లటి నీటిలో అర స్పూన్ వెనిగర్ కలపండి. ఈ లిక్విడ్‌లో శుభ్రమైన క్లాత్ ముంచి దానితో మరకను తుడిచేయండి.
- కొన్ని గోరువెచ్చని నీళ్లలో సబ్బు మిక్స్ చేసి, దాంతో తుడిచినా కూడా మరకలు చాలావరకు తొలగిపోతాయి.
- ఆలివ్ ఆయిల్‌తోనూ క్లీన్ చేయొచ్చు. కాస్త ఉప్పు, కాస్త ఆలివ్ ఆయిల్ కలిపి చిన్నపాటి ముద్దలాగ తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ఆ మరకపై పూసి, కాసేపటి తర్వాత తుడిచేయండి.
- కాస్త పెట్రోలియం జెల్లీని ఆ మరక మీద రాసి అలా వదిలేయాలి. మర్నాడు క్లాత్‌తో తుడిస్తే మరక పూర్తిగా వదిలిపోతుంది.