Vellulli Thalimpu Annam Recipe : ప్రతి ఇంట్లోనూ రాత్రివేళ అన్నం మిగిలిపోవడం జరుగుతుంది. ఇదే అన్నం పొద్దున తినమంటే ఇంట్లో వాళ్లందరూ ముఖం చిట్లిస్తారు. అందులోనూ చలికాలమైతే అప్పుడే వండిన అన్నంకాస్త చల్లగా అయితేనే తినబుద్ధికాదు. అలాంటి టైమ్‌లో సింపుల్‌గా ఇలా "వెల్లుల్లి తాలింపు అన్నం" ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పిల్లలే కాదు ఇంటిల్లిపాదీ ఈ రైస్‌ని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ పదార్థాలూ ఏమీ అవసరం లేదు. అంతేకాదు, చలికాలం ఈ రైస్ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
- అన్నం - 2 పెద్ద కప్పులు
- పచ్చిమిర్చి - 5 నుంచి 6
- కారం - తగినంత
- శనగపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - సరిపడా
- పసుపు - చిటికెడు
- మినప్పప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్ది)
- ఉప్పు - రుచికి సరిపడా
10 నిమిషాల్లోనే కమ్మటి "వెజిటబుల్ మసాలా రైస్ " - పిల్లలకు ఇష్టమైన రెసిపీ
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా వెల్లుల్లిరెబ్బలను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని చీలికలుగా, ఉల్లిపాయను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్‌లా కాకుండా జస్ట్ ఒక పల్స్ ఇచ్చి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని మీరు తీసుకునే అన్నానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కాక జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- అవి వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆపై పసుపు వేసి కలిపి మరికాసేపు వేగనివ్వాలి.
- ఆ తర్వాత అందులో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని పచ్చివాసన పోయి మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ మిశ్రమం చక్కగా వేగిందనుకున్నాక ముందుగా ఉడికించి చల్లార్చుకున్న అన్నం లేదా మిగిలిపోయిన అన్నాన్ని వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీద అన్నం బాగా వేడయ్యేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ కాసేపు కుక్ చేసుకొని దింపేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఘుమఘుమలాడే "వెల్లుల్లి తాలింపు అన్నం" రెడీ!
- ఆ తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని కాస్త నిమ్మరసం పిండి చలికాలం వేడివేడిగా తింటుంటే ఉంటుంది నా సామిరంగా ఆ టేస్ట్ వేరే లెవల్ అంతే!
లంచ్ బాక్స్ స్పెషల్ : హెల్దీ అండే టేస్టీ "పాలక్ పులావ్" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!