How to Make Vegetable Pulao Without Oil: పులావ్ చాలా మందికి ఫేవరెట్ డిష్. ఖాళీ సమయం దొరికినప్పుడు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఈ వంటకాన్ని ప్రిపేర్ చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు, డైట్లో ఉన్న వారు ఈ రెసిపీ తినడానికి ఇష్టపడరు. కారణం, ఇందులో ఆయిల్ ఎక్కువ ఉండటమే. అయితే అలాంటి వారు నూనె లేకుండా చేసిన పులావ్‌ను హ్యాపీగా తిని ఎంజాయ్ చేయవచ్చు. నూనె లేకుండా పులావ్ ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. చుక్క నూనె లేకుండా ఎంతో ఈజీగా, మరెంతో రుచికరంగా వెజిటబుల్ పులావ్ చేసుకోవచ్చు. మరి, ఇక లేట్ చేయకుండా ఆయిల్ ఫ్రీ పులావ్‌కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు:
- బాస్మతి బియ్యం – 2 కప్పులు
- లవంగాలు – మూడు
- బిర్యానీ ఆకులు – రెండు
- దాల్చిన చెక్క – చిన్న ముక్క
- యాలకులు – నాలుగు
- జాజికాయ – చిన్న ముక్క
- ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
- పచ్చిమిర్చి -3
- పాల మీగడ - 3 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- క్యారెట్ ముక్కలు - పావు కప్పు
- బీన్స్ ముక్కలు – పావు కప్పు
- బంగాళదుంప ముక్కలు - పావు కప్పు
- టమాట ముక్కలు - పావు కప్పు
- ఉప్పు – రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- పుదీనా తరుగు - కొద్దిగా
- జీడిపప్పులు – 10
- కొబ్బరిపాలు - 4 కప్పులు
తయారీ విధానం:
- వెజిటబుల్ పులావ్ కోసం బాస్మతి బియ్యాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి లవంగాలు, జాజికాయ ముక్క, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఓ నిమిషం పాటు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత పాల మీగడ వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు మగ్గించుకోవాలి.
- ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, బంగాళదుంప, టమాట ముక్కలు వేసి ఓ సారి కలపాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, జీడిపప్పులు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత బియ్యం తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల కొబ్బరిపాలు పోసి కలిపి మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి.
- పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఆవిరి పోయిన తర్వాత మూత తీసి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆయిల్ లెస్ వెజిటేబుల్ పులావ్ రెడీ. దీన్ని ఆలూ కుర్మాతో కలిపి తీసుకుంటే అద్దిరిపోతుంది. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.
చికెన్, మటన్‌తోనే కాదు మొక్కజొన్నలతోనూ "పులావ్" చేసుకోవచ్చు!- టేస్ట్ అద్దిరిపోతుంది!