How To Make Garlic Rasam at Home:అన్నంలోకి కర్రీ ఏది చేసినా.. సైడ్ డిష్‌గా వేడివేడి చారు ఉంటే.. ఆ కాంబినేషన్ భలే ఉంటుంది. అంతేనా చలికాలంలో ఏ కూరలు లేకపోయినా కొంచెం చారు పోసుకుని, అప్పడాలను నంజుకుని తింటే కలిగే ఫీలింగ్ వేరే లెవల్. వేడి వేడిగా గొంతులోకి జారుతుంటే.. అదుర్స్ అనిపిస్తుంది.
అయితే.. చారు అనగానే చాలా మంది టమాటా రసానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ ఎప్పుడూ అదే తినాలంటే బోర్ కొట్టిద్ది. అందుకే ఈసారికి వెరైటీగా ఘాటైన, ఘుమఘుమలాడే వెల్లుల్లి చారు చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. టమాటా చారు మాదిరిగానే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఈ చలికాలంలో దీనిని తినడం వల్ల జలుబు, దగ్గు సహా గొంతు సమస్యలు తగ్గిపోతాయి. మరి.. ఈ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు? ప్రిపరేషన్ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- మిరియాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 25(సుమారు 35 గ్రాములు)
- నూనె - ఒకటిన్నర టీ స్పూన్
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - 2 రెమ్మలు
- టమాట - 1
- చింతపండు - 50 గ్రాములు
- పసుపు - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నీళ్లు - 800 ml
తాలింపు కోసం:
- నూనె - 1 టేబుల్ స్పూన్
- ఆవాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - పావు టీ స్పూన్
- ఎండుమిర్చి - 4
- కరివేపాకు - 2 రెబ్బలు
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4
- ఇంగువ - చిటికెడు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం:
- ముందుగా వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన ఉంచాలి. టమాట ముక్కలను సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. అదే విధంగా చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు మిరియాలు, జీలకర్రను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి కచ్చాపచ్చగా దంచి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కాడలతో సహా కరివేపాకు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి.
- వెల్లుల్లి వేగిన తర్వాత టమాట ముక్కలు వేసి ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు పోసి ఓ పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి.
- అనంతరం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు మగ్గించాలి.
- ఆ తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఓ 15 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
- దింపే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి రసంలో కలిపితే ఎంతో ఘుమఘుమలాడే వెల్లుల్లి చారు రెడీ. వేడి వేడి అన్నంలో తింటే అమృతమే.
వింటర్ స్పెషల్ - ఘుమఘుమలాడే "కళ్యాణ రసం" - ఇలా చేస్తే తినడమే కాదు డైరెక్ట్‌గా తాగేస్తారు కూడా!
"మైసూర్ స్టైల్ టమాటా రసం" - రుచి అమోఘంగా ఉంటుంది! - ఇలా ప్రిపేర్ చేయండి!
సూపర్ టేస్టీ : 10 నిమిషాల్లో టమాటా మిరియాల రసం - ఇలా ప్రిపేర్ చేస్తే ఒట్టి రసం కూడా తాగేస్తారు!