Dhanurmasam 2024 : కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం ఎంతో విశిష్టమైనది. ఈ కథనంలో ధనుర్మాసానికి ఎందుకంతటి విశిష్ట వచ్చింది? ఈ మాసంలో శుభకార్యాలు చేయవచ్చా? ఈ మాసానికి శూన్య మాసమని ఎందుకు పేరు వచ్చింది? తదితర వివరాలను తెలుసుకుందాం.
ధనుర్మాసం అంటే?
డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని అంటారు.
విష్ణు పూజ - బాలభోగం
ధనుర్మాసం విష్ణు పూజకు చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ధనుర్మాసంలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.
ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత?
దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, పొంగల్ ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు.
దారిద్య్రాన్ని దూరం చేసే లక్ష్మీ పూజ
ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రం దూరమవుతుందని విశ్వాసం.
ముగ్గులు - గొబ్బెమ్మలు
ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు వేకువఝామున ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది.
ధనుర్మాస వ్రతం - మార్గళి
ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
కల్యాణ ప్రాప్తి
ధనుర్మాసంలో వివాహం కావాల్సిన అమ్మాయిలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి, తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెలరోజులూ చేయలేని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. ఇలా చేయడం వలన వారికి కోరుకున్న వ్యక్తితో అతి త్వరలో వివాహం జరుగుతుందని ప్రతీతి.
ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?
ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం.
ఇంతటి విశిష్టమైన ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.