Omar Abdullah About JK Statehood : జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా అంశాన్ని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రస్తావించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు.
"జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం వల్ల కలిగిన ప్రయోజనం ఒక్కటికీ లేదు. క్రీడల్లో ఒక్కరే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అంతకు మించి సారథులు ఉంటే గందరగోళానికి దారి తీస్తుంది. అలాగే దేశానికి ఒకరే ప్రధానమంత్రి, ఒకటే కేంద్రప్రభుత్వం ఉంటుంది. ఒక ప్రాంతంలో రెండు అధికారాలు ఉంటే అక్కడ అభివృద్ధికి అవకాశం ఉండదు. ఎన్నికైన ముఖ్యమంత్రికి తన మంత్రివర్గంతో కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. ఇద్దరి చేతుల్లో అధికారం ఉంటే అక్కడ పురోగతి ఉండదు" అని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
"జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలకు హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో పదే పదే ఇదే ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలి" అని ఒమర్ అబ్దుల్లా కోరారు.
రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారా?
2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అయితే ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.
దీనితో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఒమర్ అబ్ద్దుల్లా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదాను తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదించారు. తాజాగా రాష్ట్ర హోదా అంశంపై మరోసారి తన గళాన్ని వినిపించారు ఒమర్. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను దీనిపై దృష్టి సారించాలని కోరారు.