Health Benefits of Eating Raw Papaya : పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే డాక్టర్లు కూడా ప్రతిరోజూ కొన్ని పండ్లు తినాలని సూచిస్తుంటారు. అలాంటి వాటిలో బొప్పాయి ఒకటి. ఇది సీజన్‌తో సంబంధం లేకుండా లభిస్తుంది. ఈ పండు రుచిగా ఉండడమే కాదు.. ఇందులో విటమిన్లు, మినరల్స్ సహా మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే సాధారణంగా బొప్పాయిని అందరూ పండిన తర్వాతనే తింటారు. కానీ, బొప్పాయి.. కాయ దశలో ఉన్నప్పుడు తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. మరి పచ్చి బొప్పాయి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో చూద్దాం..
మెరుగైన జీర్ణక్రియ : పచ్చి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అలా ఇందులో ఉండే ఎంజైమ్‌లు కడుపులోని వ్యర్థాలను బయటకు పంపివేయడంలో సహాయపడతాయని.. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
క్యాన్సర్ నివారిస్తుంది : పచ్చి బొప్పాయి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని లైకోపీన్, బీటా-కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన మూలకాలను తొలగించి, కణాలను దెబ్బతీయకుండా కాపాడతాయని అంటున్నారు. ముఖ్యంగా పురుషులలో ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం కూడా ఈ విషయాన్ని ఓ అధ్యయనంలో స్పష్టం చేసింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
కామెర్లు : కామెర్లను నివారించడంలో పచ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ప్రతి మూడు గంటలకోసారి అరగ్లాసు బొప్పాయి రసం తాగడం వల్ల జాండిస్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
మలేరియా : బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, సి రోగి రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతాయని చెబుతున్నారు. అలాగే బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల మలేరియా, డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంటుందని.. అలాగే.. అద్భుతమైన యాంటీ మలేరియా ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
బాడీలో మంట తగ్గిస్తుంది : పచ్చి బొప్పాయి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, ఋతు తిమ్మిరితో సహా శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులు, మంట, వాపులను తగ్గించడంలో పచ్చి బొప్పాయిలోని పోషకాలు ప్రభావవంతగా పనిచేస్తాయంటున్నారు.
బరువు తగ్గడానికి: పచ్చి బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుందని.. దీంతో అనవసరమైన ఆహారం తీసుకోవడం తగ్గుతుందని.. తద్వారా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యానికి: పచ్చి బొప్పాయిలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని.. తద్వార గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంటున్నారు.
చర్మ ఆరోగ్యానికి: కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా పచ్చి బొప్పాయి సహాయపడుతుందని అంటున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, ఇ చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ ఉంచడానికి సహాయపడతాయని.. ముడతలు పడకుండా నిరోధిస్తాయని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజూ ఉదయం బొప్పాయి తింటున్నారా? ఈ హెల్త్ బెనిఫిట్స్ పొందినట్లే !
బొప్పాయితో వారంలో 2కిలోల వెయిట్ లాస్! ఇందులో నిజమెంత? డాక్టర్లు ఏమంటున్నారు?