Easy Kitchen Hacks : మార్నింగ్ టీ, కాఫీ పెట్టడం నుంచి మొదలు పెడితే.. రాత్రి తిన్న తర్వాత గిన్నెలు కడగడం వరకు మహిళలు రోజంతా కిచెన్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఈ డైలీ రొటీన్ దాదాపు అందరి ఇళ్లలో ఉండేదే! ఈ క్రమంలో వంట చేసేటప్పుడు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఈ టిప్స్ పాటించడం ద్వారా పనులను చకచకా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు ఏంటో మీరు చూసేయండి..
చెక్కతో చేసినవి..
కొన్ని సందర్భాల్లో చెక్కతో చేసిన చాపింగ్ బోర్డ్ నుంచి వాసన వస్తుంటుంది. ఇలాంటప్పుడు బోర్డ్‌పై రాక్ సాల్ట్ వేసి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆపై అర చెక్క నిమ్మకాయతో రుద్ది నీటితో కడగాలి. ఇలా చేస్తే వాసన పోతుంది. చెక్కతో తయారు చేసిన స్పూన్లను చాలా ఈజీగా క్లీన్ చేయచ్చు. ఇందుకోసం వాటిని కొద్దిసేపు హాట్ వాటర్లో మరిగించి ఎండలో ఆరబెడితే చాలు.
ఆకుకూరలు ఇక తాజాగా..
ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉంటేనే రుచిగా ఉంటాయి. అయితే, ప్రత్యేకించి కొన్ని ఆకుకూరలు ఫ్రిడ్జ్‌లో పెట్టినా తాజాదనం కోల్పోతుంటాయి. అలా కాకుండా ఉండడానికి ఈ చిట్కా ట్రై చేయండి. ముందుగా ఆకుకూరలను కట్ చేయండి. ఆపై ఐస్‌క్యూబ్ ట్రేలో వేసి నీళ్లు పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండడంతో పాటు అందులోని పోషకాలు అలాగే ఉంటాయి.
నట్స్..
నట్స్‌తో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని నట్స్‌పై పెంకు లాంటి గట్టి పదార్థం ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది అవి గట్టిగానే ఉన్నాయి కదా అని వాటిని గది ఉష్ణోగ్రత వద్దే ఉంచుతారు. కానీ, వాటిని ఫ్రిడ్జ్‌లో పెడితే ఎక్కువ రోజులు ఉండడంతో పాటు అందులోని పోషకాలు కూడా భద్రంగా ఉంటాయి.
ఇక కళ్లల్లో నీళ్లు రావు!
సాధారణంగా ఉల్లిగడ్డలు కట్ చేస్తే కళ్లల్లో నుంచి నీళ్లు వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే.. ఉల్లిగడ్డలు కోయడానికి అరగంట ముందు వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఆపై వాటిని కట్ చేస్తే కన్నీళ్లు రావు. ఎందుకంటే చల్లగా ఉండే ఉల్లిగడ్డల్లో.. కన్నీళ్లకు కారణమయ్యే ఎంజైమ్‌లు నెమ్మదిగా విడుదలవుతాయి.
వంటపాత్రలు కొత్తవాటిలా..
కొన్ని గిన్నెలు ఎంత శుభ్రం చేసినా అలానే ఉంటుంటాయి. ఇలాంటప్పుడు ఒక బకెట్లో నీళ్లు పోసి అందులో కొద్దిగా వెనిగర్ కలపాలి. వాటిలో వంట పాత్రలను ఉంచి నైట్ మొత్తం నానబెట్టి ఉదయాన్నే శుభ్రం చేస్తే పాత్రలు తళతళా మెరుస్తుంటాయి.
గుడ్డు పెంకు ఈజీగా రావాలంటే..
దాదాపు అందరూ కోడిగుడ్లను నేరుగా చల్లటి నీళ్లలో కాస్త ఉప్పు వేసి ఉడకబెడుతుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు పెంకు తీయడం కష్టమవుతుంది. దీనికి బదులు వాటర్ కొద్దిగా వేడయ్యాక వాటిలో గుడ్లు వేసి ఉడకబెట్టండి. దీనివల్ల పెంకులు సులభంగా వస్తాయి. అయితే నీళ్లలో ఉప్పుకి బదులుగా వెనిగర్ లేదా బేకింగ్ సోడా కలిపితే మంచి ఫలితం ఉంటుంది.
కిచెన్‌లో మీ పని ఈజీ చేసే చిట్కాలు - ఇవి పాటిస్తే మాస్టర్ చెఫ్ ఇక మీరే!
కూరగాయలు కట్ చేసుకోవడానికి కొత్త నేస్తం - 12 రకాల పనులు చేస్తుంది!