Constructed Houses selling in Hyderabad : ప్రస్తుతం నగర నిర్మాణ రంగంలో 3 పడక గదుల ఇళ్లకు భారీగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల్లో వీటిని వేగంగా విక్రయించగలుగుతున్నారు. దీంతో చాలా ప్రాజెక్టుల్లో ఆరంభంలోనే బుకింగ్స్ పూర్తవుతున్నాయి. ఈ అనుభవాలతో చాలా మంది బిల్డర్లు పూర్తిగా మూడు, అంతకంటే ఎక్కువ పడక గదుల గృహాలను నిర్మిస్తున్నారు. మరోవైపు రెండు పడక గదుల ఫ్లాట్లు విక్రయించడం కాస్త క్లిష్టంగా ఉందని బిల్డర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో పూర్తయిన, పూర్తి కావొస్తున్న నిర్మాణాలు, ప్రాజెక్టులో వీటి లభ్యత ఎక్కువగానే ఉంది. ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారు విస్తీర్ణం పరంగా రాజీ పడితే, సొంతింటి కల నెరవేరుతుంది. సిద్ధంగా ఉన్న ఇళ్ల కోసం ఎదురు చూస్తే రెండు పడక గదుల విభాగంలో పలు ప్రాజెక్టుల్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నివాసాలు సుమారు 800 నుంచి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. విస్తీర్ణం ఆధారంగా ధరలు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని తూర్పు, దక్షిణం, ఉత్తర ప్రాంతాల్లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు చాలా ఉన్నాయని నిర్మాణదారులు అంటున్నారు.
పలు సానుకూలతలున్నాయ్ ఇలా..
- నిర్మాణంలో ఉన్న వాటితో పోలిస్తే సిద్ధంగా ఉన్న ఇళ్లకు ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ స్తబ్ధుగా ఉండటంతో బిల్డర్లు ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు.
- ఇల్లు కొనే ఉద్దేశం ఉన్న వారితోనే బిల్డర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. పేమెంట్ విషయంలోనూ వెసులుబాట్లు కల్పిస్తున్నారు.
- ఇల్లు నిర్మాణ ప్రారంభంలో ప్రాజెక్ట్ గురించి కాగితాల్లో, వీఆర్‌లో తప్ప ఎలా ఉంటుందో కచ్చితంగా తెలుసుకోలేం. కానీ పూర్తయిన ఇళ్లను స్వయంగా పరిశీలించడంతో పాటు అనువుగా అనిపిస్తే కొనుగోలు చేయవచ్చు.
- పూర్తయిన, పూర్తి కావొచ్చిన ఇళ్ల నిర్మాణాల నాణ్యత తెలిసిపోతుంది. బిల్డర్లు బ్రోచర్లో పేర్కొన్న విధంగానే నిర్మాణం చేపట్టారా లేదా అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు.
- ఇంటి నిర్మాణం చివరి దశలో ఉండగానే కొంతమంది ఇంట్లోకి దిగిపోతుంటారు. వారితో మాట్లాడి వారి సాదకబాధకాలను తెలుసుకోవచ్చు. అలా సమస్యల పరిష్కారంపై బిల్డర్ స్పందిస్తున్న తీరు ఆధారంగా కొనాలా వద్దా అనేదీ నిర్ణయించుకోవచ్చు.
- వెంటనే ఇంట్లోకి మారిపోవచ్చు. అందుకు ఒకవైపు అద్దె, ఇంకోవైపు ఈఎంఐ భారం లేకుండా ఉంటుంది. మరికొంత కలిపి మొత్తం అద్దెకు కట్టగలిగితే ఇంటి ఈఎంఐ కూడా చెల్లించవచ్చు.
- మీ ఆదాయానికి తగ్గట్టుగా రెండు పడక గదుల నివాసానికి ఇంటి రుణం పొందడం కష్టమేమీ కాదు. వైద్యం, పిల్లల విద్య, ఇతర అవసరాలకు రాజీపడకుండా ఇంటి రుణ వాయిదాలు చెల్లించవచ్చు.
- ఇల్లు తక్కువ విస్తీర్ణంలో ఉన్నందున కమ్యూనిటీలో నిర్వహణ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. నెలనెలా చెల్లించడం పెద్ద కష్టం కాదు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబానికి ఈ రెండు పడక గదుల నివాసం సరిపోతుందని డెవలపర్లు చెబుతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకునే ఇళ్లు నిర్మిస్తుంటామని అంటున్నారు. ఆదాయం పెరిగి పిల్లలు పెద్దయ్యాక ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్‌కు కూడా మారిపోవచ్చని చెబుతున్నారు.
- స్థిరమైన అద్దె ఆదాయానికి రెండు పడక గదుల ఫ్లాటు మేలనే అభిప్రాయం కొనుగోలుదారుల్లో కూడా ఉంది. ఇప్పుడు మార్కెట్ పరిస్థితిల్లో బిల్డర్లు రాయితీలు ఇస్తుండటంతో చాలా మంది కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
పాతవైనా కొనుగోలుకు మొగ్గు : ప్రస్తుతం చాలా మంది ఇప్పుడున్న రెండు పడక గదులను విక్రయించి, ఇంటి అప్‌గ్రెడేషన్ కోసం అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇంటికి మారుతున్నారు. కొంత మంది పాత ఇళ్లను అద్దెకు ఇస్తుంటే, ఇంకొంతమంది వాటినే విక్రయిస్తున్నారు. దీంతో రెండు పడక గదుల నివాసాల లభ్యత సెకండ్స్లోనూ అధికంగా ఉంటోంది. పాతవైనా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటంతో కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.