How to Make Sorakaya Halwa Recipe : చాలా మందికి ఇష్టమైన స్వీట్లలో హల్వా కూడా ఒకటి. పండగలు, శుభకార్యాల సమయాల్లో ఎక్కువ మంది దీన్ని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు క్యారెట్, బ్రెడ్‌తో హల్వా ట్రై చేసి ఉండొచ్చు. కానీ, ఓసారి "సొరకాయ హల్వాను" ప్రిపేర్ చేసుకొని చూడండి. ఎంతో తీయగా ఉండే ఈ హల్వాను ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు! దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి బయటకు తీసి అర నిమిషం వేడి చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా సొరకాయ హల్వా ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- లేత సొరకాయలు-2 (చిన్నవి)
- పాలు- ఒకటిన్నర లీటర్లు
- పంచదార- రుచికి సరిపడా
- యాలకులపొడి- అరటీస్పూన్
- బాదం-15
- జీడిపప్పు-10
- కిస్‌మిస్-10
- నెయ్యి-1/3 కప్పు
- పచ్చ రంగు ఫుడ్‌కలర్- కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా సొరకాయని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసుకోవాలి. ఆపై సొరకాయలోని గింజలు, దూది భాగాన్ని తీసేసుకోండి.
- గింజలు తీసేసిన సొరకాయ ముక్కలను పొడవుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు సొరకాయ ముక్కలను గ్రేటర్లో పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకోవాలి.
- ఇలా తురుముకున్న సొరకాయ మిశ్రమాన్ని నీళ్లు లేకుండా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఆపై బాదం, జీడిపప్పులను సన్నగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెను స్టౌపై పెట్టండి. ఇందులో పాలు పోయండి.
- స్టౌ హైఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి పాలను కలుపుతూ బాగా మరిగించండి.
- దాదాపు పాలను 350 ml అయ్యే వరకు మరిగించాలి.
- పాలు మరుగుతున్న సమయంలోనే మరో కడాయిలో నెయ్యి వేసి కరిగించండి.
- నెయ్యి హీట్ అయ్యాక బాదం, జీడిపప్పులు వేసి ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక.. కిస్‌మిస్ వేసి వేపండి.
- తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే కడాయిలో నీరు పిండుకున్న సొరకాయ తురుము వేసి వేపండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి తురుము బాగా వేపుకోండి.
- ఒక 15 నిమిషాల తర్వాత పంచదార వేసి కలపండి. పంచదార కరిగి హల్వా కాస్త జిగురు పాకంలా వస్తుంది. ఇందుకోసం మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆపై చిక్కగా మరిగించుకున్న పాలను హల్వాలో పోసుకుని బాగా మిక్స్ చేయాలి.
- ఇప్పుడు యాలకుల పొడి వేసి కలపండి. ఒక 8 నిమిషాల తర్వాత హల్వా కోవాలా రెడీ అవుతుంది. ఈ సమయంలో మీకు నచ్చితే గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోండి.
- ఆ తర్వాత వేపుకున్న డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేయండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే ఇలా చేస్తే ఎంతో కమ్మటి సొరకాయ హల్వా మీ ముందుంటుంది.
- సొరకాయ హల్వా కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
- ఈ హల్వా రెసిపీ నచ్చితే ఓసారి ట్రై చేయండి.
దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్‌దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీగా చేసుకోండిలా!
సంక్రాంతి స్పెషల్- నోరూరించే అరిసెలు, బూందీ లడ్డూ! చేయడం చాలా ఈజీ!