How to Make Garlic Chicken Fry : దసరా వచ్చిదంటే చాలు.. మాంసాహారం తినే ప్రతి ఇంటా నాన్‌వెజ్ ఐటమ్స్ ఘుమఘుమలాడాల్సిందే. అందులో చికెన్ ఫ్రై తప్పకుండా ఉంటుంది. అయితే, రొటీన్ మాదిరిగా కాకుండా.. ఈ దసరా వేళ "గార్లిక్ చికెన్ ఫ్రై" ట్రై చేయండి. వెల్లుల్లి గుబాళింపుతో ఈ చికెన్ ఫ్రై కరకరలాడుతూ.. చాలా రుచికరంగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు :
- బోన్‌లెస్ చికెన్ - 400గ్రాములు
- నూనె - వేయించడానికి తగినంత
వెల్లులి మసాలా ముద్ద కోసం :
- వెల్లుల్లి రెబ్బలు - 25 నుంచి 30
- పచ్చిమిర్చి - 6 నుంచి 8
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉల్లిపాయ - 1(చిన్న సైజ్‌లో ఉన్నది)
చికెన్ మారినేషన్ కోసం :
- వేయించిన ధనియాల పొడి - 1 టీస్పూన్
- గరం మసాలా - 1 టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- పసుపు - కొద్దిగా
- ఉప్పు - రుచికి తగినంత
- రెడ్ ఫుడ్ కలర్ - 3 నుంచి 4 డ్రాప్స్
- వెనిగర్ - అర టేబుల్‌స్పూన్
- కార్న్‌ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్లు
టాసింగ్ కోసం :
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- జీడీపప్పు - 3 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి - 2(చీల్చిన ముక్కలు)
- సన్నని వెల్లుల్లి తరుగు - 1 టేబుల్‌స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- వెల్లులి పొడి / చాట్ మసాలా - అర టీస్పూన్
గోంగూరతో చికెన్ కర్రీ మాత్రమే కాదు బిర్యానీ చేయవచ్చు - ఇలా ప్రిపేర్ చేయండి - టేస్ట్ సూపర్!
తయారీ విధానం :
- ముందుగా ఈ రెసిపీలోకి కావాల్సిన వెల్లుల్లి మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్‌ను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత అందులో వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, మిక్సీ పట్టుకొని పెట్టుకున్న వెల్లుల్లి మసాలా పేస్ట్, వెనిగర్ వేసి ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి.
- ఆ తర్వాత చికెన్ ఫ్రై కాస్త కలర్ఫుల్గా కనిపించడానికి అందులో రెడ్ ఫుడ్ కలర్ 3 నుంచి 4 డ్రాప్స్ వేసుకోవాలి. అయితే, ఇది ఆప్షనల్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
- అయితే, ఈ చికెన్ ఫ్రైలో ఎండుమిర్చి కారం యూజ్ చేయట్లేదు కాబట్టి మీరు వాడే పచ్చిమిర్చినే కారాన్ని రుచికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే.. కారం వేయట్లేదు కాబట్టి చికెన్ ఫ్రై లైట్ కలర్లో కనిపిస్తుంది. అందుకే.. ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నామనే విషయం గుర్తుంచుకోవాలి.
- అనంతరం ముక్కలు క్రిస్పీగా అవ్వడానికి అందులో కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆపై కనీసం ఒక గంటపాటైనా మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఊరనివ్వాలి. అయితే, ఫ్రిజ్ లేనివారు బయటైనా ఉంచుకోవచ్చు.
- గంట తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. మారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కలన్ని ఒకేసారిగా కాకుండా రెండు సగాలుగా విభజించుకొని ముందుగా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- అలా వచ్చాక స్టౌను హై ఫ్లేమ్‌కి టర్న్ చేసుకొని ముక్కలు క్రిస్పీగా, పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ విధంగా వేయించుకున్నాక.. వాటిని జల్లి గంటెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు టాసింగ్ కోసం.. స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడి అయ్యాక జీడిపప్పు, సన్నని వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్ మీద జీడిపప్పు రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
- జీడిపప్పు రంగు మారడం స్టార్ట్ అయ్యాక.. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, వెల్లుల్లి పొడి లేదా చాట్ మసాలా వేసుకొని హై-ఫ్లేమ్ మీద కాసేపు బాగా టాస్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే 'గార్లిక్ చికెన్ ఫ్రై' రెడీ!
ఈ కొలతలతో చేస్తే 'హోటల్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ' పక్కా! ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు!!