Gajar Halwa Recipe in Telugu : హల్వా.. ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్ రెసిపీలలో ముందు వరుసలో ఉంటుంది. పండగలు, శుభకార్యాల టైమ్‌లో చాలా మంది దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు హల్వాలో ఎన్నో రకాల వెరైటీలు ట్రై చేసి ఉండొచ్చు. కానీ, ఓసారి "గాజర్ హల్వాను" ప్రిపేర్ చేసుకొని చూడండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ హల్వానుఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు! పైగా దీన్ని చాలా తక్కువ పదార్థాలతో నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ఇంతకీ, ఈ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- పింక్ క్యారెట్ తురుము - 3 కప్పులు
- నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు
- బాదంపప్పు, జీడిపప్పు, కిస్మిస్ - ఒక కప్పు
- బెల్లం తురుము - 1 కప్పు
- కాచి చల్లార్చిన పాలు - 1 చిన్న గ్లాసు
బ్రెడ్ హల్వా చాలా సార్లు తిని ఉంటారు! - ఓ సారి రస్క్‌తో ట్రై చేయండి - ఆ మధురం అద్భుతం!!
తయారీ విధానం :
- ఇందుకోసం మామూలు క్యారెట్స్ కాకుండా మార్కెట్లో దొరికే పొడవుగా ఉండే పింక్ కలర్ క్యారెట్స్ని ఎంచుకోవాలి. ఆపై వాటిని శుభ్రంగా కడిగి పైచెక్కు తీసి సన్నగా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ అవి దొరక్కపోతే మామూలు క్యారెట్స్తోనైనా దీన్ని చేసుకోవచ్చు.
- ఇప్పుడు స్టౌపై కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక.. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదంపప్పు పలుకులను వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు, కిస్మిస్నూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే పాన్‌లో మరో టేబుల్‌స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. అది కరిగి వేడెక్కాక.. ముందుగా సిద్ధం చేసుకున్న పింక్ క్యారెట్(గాజర్) తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయి 80శాతం వరకు వేగేటట్లు బాగా వేయించుకోవాలి.
- క్యారెట్ లేదా గాజర్ తురుముని ఎంత బాగా వేయించుకుంటే హల్వా అంత రుచికరంగా వస్తుందని గుర్తుంచుకోవాలి.
- ఆవిధంగా క్యారెట్ తురుముని వేయించుకున్నాక.. బెల్లంతురుము వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆపై కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని మరోసారి మిశ్రమం మొత్తం కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై కొన్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్.. వేసుకొని మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "గాజర్ హల్వా" రెడీ!
నోరూరించే "కొబ్బరి హల్వా" - ఈ పద్ధతుల్లో చేస్తే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది!