Famous Hindu Temples Outside India :భారతదేశం హిందూ దేవాలయాలకు పుట్టినిళ్లుగా చెబుతారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే.. మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ప్రముఖ హిందూ దేవాలయాలున్నాయి. ఎంతో మంది హిందువులు వాటిని చూడడానికి వెళ్తుంటారు. మీరు కూడా విదేశాల్లో ఉన్న ఆలయాలను చూడాలనుకుంటున్నారా? అయితే.. ఈ స్టోరీ మీ కోసమే.
అంగ్కోర్ వాట్ :
భక్తులను మంత్రముగ్ధులను చేసే అతిపెద్ద విష్ణు దేవాలయం అంగ్కోర్ వాట్. ఇది కాంబోడియాలో ఉంది. ఈ ఆలయం దాదాపు 400 ఎకరాలలో విస్తరించి ఉంది. అంగ్ కోర్ వాట్లోనే 100కు పైగా రాతి ఆలయాలున్నాయి. అలాగే 70 స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది. అలాగే అతిపెద్ద మతపరమైన నిర్మాణాలలో ఒకటిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
శ్రీ సుబ్రమణ్య స్వామి దేవస్థానం :
మలేషియాలోని బటు గుహల వద్ద సుబ్రమణ్యస్వామి భారీ విగ్రహం, ఆలయం ఉన్నాయి. సుబ్రమణ్యస్వామి విగ్రహం 42.7 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గుహలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. అందమైన గుహల మధ్యలో ఉన్న సుబ్రమణ్యస్వామి అతిపెద్ద విగ్రహంపర్యాటకులను కళ్లు తిప్పకోకుండా చేస్తుంది. మలేషియాలో స్థిరపడ్డ అక్కడి హిందువులు ఈ విగ్రహాన్ని 1890ల్లో ఏర్పాటు చేశారు.
ప్రంబనన్ ఆలయం :
ఇండోనేసియాలోని యోగ్యకర్త ప్రాంతంలో ప్రంబనన్ ఆలయం ఉంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కొలువై ఉండటంతో.. దీనిని త్రిమూర్తి దేవాలయం అని కూడా భక్తులు పిలుస్తుంటారు. ప్రంబనన్ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది.
పశుపతినాథ్ ఆలయం :
నేపాల్ రాజధాని ఖాట్మాండులోని భాగమతి నది ఒడ్డున పశుపతినాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రపంచంలో అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి. పరమశివుడే.. ఇక్కడ పశుపతినాథ్‌గా కొలువై దర్శనమిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు.
తనాహ్ లాట్ ఆలయం :
ఇండోనేసియాలోని బాలిలో హిందూ మహా సముద్రంలో తనాహ్ లాట్ ఆలయం ఉంది. బాలి తీర ప్రాంతంలో ఉన్న ఏడు ఆలయాల్లో ఇది కూడా ఒకటి. సముద్రం ఒడ్డున నీలం రంగు నీటిలో.. పచ్చగా చెట్లతో ఉండే దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుందని పర్యాటకులు చెబుతుంటారు. సూర్యాస్తమయం సమయంలో ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది.
స్వామి నారాయణ్ మందిర్ :
లండన్‌లో నిర్మించిన అతిపెద్ద ఆలయం.. స్వామి నారాయణ్ మందిర్. ఇక్కడ సాక్షాత్తూ ఆస్వామి నారాయణుడు కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. యూఏఈలోని అబుదాబిలో, అలాగే అమెరికాలోని కాలిఫోర్నియాలోనూ ఈ ఆలయాలను నిర్మించారు.