Coffin Cafe in Japan :ఒక్క ఛాన్స్ ఉంటే, జీవితంలో వెనక్కి వెళ్లి చేసిన తప్పులు కరెక్ట్ చేసుకొని, మళ్లీ రిపీట్ కాకుండా ఫ్రెష్‌గా లైఫ్ స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్లు ఎందరో! కానీ, నిజ జీవితంలో అది సాధ్యం కాదు. అయితే అలాంటి ఒక ఛాన్స్ మేం ఇస్తాం అంటోంది ఓ కెఫె. జనాలకు ఇది ఫుల్లుగా నచ్చేసింది. అక్కడికి వెళ్లి కాసేపు శవపేటికలో పడుకొని, మళ్లీ కొత్తగా పుడుతున్నారు! దీనికోసం క్యూ కడుతున్నారు. మరి, ఇంతకీ ఆ కెఫె వాళ్లు ఇచ్చే ఆ ఛాన్స్ ఏంటి? శవపేటికలో పడుకోవడం ఏంటి? అనే వివరాలు ఇక్కడ చూసేయండి.
జపాన్ దేశంలో అంతిమ సంస్కారాలు నిర్వహించే ఒక సంస్థ ఉంది. దాని చరిత్ర చాలా పెద్దది. ఏకంగా 120 ఏళ్ల నుంచి అది నడుస్తోంది. ఆ సంస్థ నిర్వాహకులు ఇటీవల "కొఫిన్ కెఫె" అనే పేరుతో ఒక కొత్త కెఫెను స్టార్ట్ చేశారు. అయితే, ఇక్కడ టీ, కాఫీ తాగడానికి వచ్చేవాళ్లు కూర్చోవడానికి కుర్చీలు, టేబుళ్లతోపాటు శవ పేటికలు కూడా సిద్ధం చేశారు! మూడు రంగుల్లో ఆ కొఫిన్ బాక్సులను అలంకరించారు.
చాయ్ తాగడానికి వెళ్లిన వారు ఆ తర్వాత ఈ శవపేటికల్లో పడుకోవచ్చు. మొదట్లో జనాలు పెద్దగా "సాహసం" చేయలేదుగానీ, ఆ సంస్థ నిర్వాహకులు చెప్పిన ఉద్దేశం నచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా ఆ శవపేటికలో పడుకుంటున్నారు. ఇంతకీ వాళ్లు చెప్పేది ఏమంటే, "మరణించిన వారి అంత్యక్రియలు చేసేందుకు మా వద్దకు వచ్చే బంధువులతో మేం మాట్లాడుతూ ఉంటాం. చనిపోయే వారిలో చాలామంది ఒత్తిడి తట్టుకోలేకనో, మరేదైనా కారణంతోనో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజానికి అవన్నీ చాలా చిన్న చిన్న సమస్యలు. వాటికే తమ విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారని మాకు అర్థమైంది. అలాంటి వారి మనసు తేలిక చేసి, జీవితంపై కొత్త ఆశలు కల్పించడానికే ఈ శవపేటిక ఆలోచన చేశాము" అంటున్నారు నిర్వాహకులు.