Vankaya Pachi Pulusu Recipe in Telugu : చాలా మంది ఎక్కువగా ఇష్టపడే రెసిపీలలో ఒకటి వంకాయ. అయితే, మీరు ఇప్పటి వరకు గుత్తొంకాయలతో కర్రీ, పచ్చడి, వంటి ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా "వంకాయ పచ్చి పులుసు" ట్రై చేశారా? లేదంటే మాత్రం ఓసారి ఈ రెసిపీని తప్పక ప్రయత్నించి చూడాల్సిందే. టేస్ట్ మహా అద్భుతంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఈ రసాన్ని ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో దీన్ని కాస్త పోసుకొని తిన్నా చాలు. ఆ రుచి అమోఘం. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- తెల్ల గుత్తొంకాయలు - 4
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - పిడికెడు
- అల్లం - అర అంగుళం ముక్క
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- చింతపండు రసం - నిమ్మకాయ సైజంత
- బెల్లం తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
తాలింపు కోసం :
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అరటీస్పూన్
- మెంతులు - పావుటీస్పూన్
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 6
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరీ చిన్నవి కాకుండా కాస్త పెద్ద సైజ్‌లో ఉండే గింజ పడని తెల్ల గుత్తొంకాయలను తీసుకోవాలి. ఆపై వాటికి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ మీద గ్రిల్ పెట్టి దానిపై నూనె రాసిన వంకాయలను ఉంచాలి. అనంతరం లో ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో తిప్పుతూ వాటిపై స్కిన్ నల్లగా మారే వరకు బాగా కాల్చుకోవాలి.
- ఆవిధంగా కాల్చుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ చల్లుకోవాలి. ఆ తర్వాత వంకాయలపై నల్లగా కాలిన పై చెక్కును తొలగించుకోవాలి.
- అనంతరం వాటిని ఫోర్క్ లేదా స్పూన్ సహాయంతో మెత్తగా మెదుపుకొని పక్కనుంచాలి. అలాగే, రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మాష్ చేసుకున్న కాల్చిన వంకాయల గుజ్జు, ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని బాగా గట్టిగా పిండుతూ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా చక్కగా కలుపుకొని పక్కనుంచాలి.
- అలాగే, ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి రెడీగా ఉంచుకోవాలి.
- అనంతరం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, మెంతులు, శనగపప్పు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.
- అవి వేగాక క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి మరికాసేపు వేయించి దింపేసుకోవాలి.
- ఇప్పుడు తాలింపు పాన్‌లో ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం, వంకాయ మిశ్రమం, బెల్లం తురుము వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "వంకాయ పచ్చి పలుసు" రెడీ!
ఇవీ చదవండి :
సూపర్ టేస్టీ 'బెండకాయ మజ్జిగ పులుసు'- ఇలా చేస్తే చుక్క మిగలకుండా జుర్రేస్తారు!
జలుబు, దగ్గు, గొంతునొప్పికి అమృతంలా పనిచేసే - ఉడుపి స్టైల్ "మిరియాల రసం"!