Best Tips to Reduce Sourness in Curries :ఏ కూరలోనైనా ఉప్పు, కారం, పసుపు, మసాలాలు ఇలా అన్ని పదార్థాలు సరిగ్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కానీ, అనుకోకుండా కొన్నిసార్లు కూరలు వండే క్రమంలో కారం, ఉప్పుఎక్కువైపోతుంటాయి. అయితే, ఇవి మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో పులుపు కూడా ఎక్కువై పోతుంది. ఆ టైమ్‌లో పులుపుని బాగా ఇష్టపడేవారూ తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. దీంతో ఆ కూరల్ని పక్కన పెట్టేస్తుంటారు. అలాకాకుండా కర్రీల్లో పులుపు ఎక్కువైనప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. పులుపు తగ్గడమే కాకుండా కూరలకు అదనపు రుచి వస్తుందంటున్నారు. మరి, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
బంగాళాదుంపలు :కూరల్లో పులుపు ఎక్కువైతే ఈ టిప్ ఫాలో అవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటంటే గ్రేవీలో సగం ఉడికించిన ఒక ఆలుగడ్డ ముక్కలను వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి. అప్పుడు కర్రీలోని పులుపుని ఆలూ బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ మీకు కూరలో బంగాళదుంప ముక్కలు నచ్చకపోతే అవి ఉడికాక తీసేయొచ్చు.
బెల్లం : కర్రీలో ఎక్కువైన పులుపుని తగ్గించడంలో ఇదీ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు, కర్రీ టేస్ట్‌ని మరింత పెంచి సరికొత్త రుచిని అందిస్తుంది. అందుకోసం మీరు చేయాల్సిందల్లా పులుపు ఎక్కువైన కూరలో కొద్దిగా బెల్లాన్నివేసి బాగా కలిపి కాసేపు ఉడించుకుంటే చాలు. కానీ, మరీ ఎక్కువగా మాత్రం వేయొద్దు. ఇలా వేస్తే కర్రీ టేస్ట్ మరీ స్వీట్‌గా, డిఫరెంట్‌గా ఉంటుందని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.