How To Make Maramarala Vada : వడలు అంటే చాలా మందికి ఇష్టం. కానీ, వీటిని ఇంట్లో తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. మినపప్పు నానబెట్టి, రుబ్బుకోవాలి. ఆ తర్వాత వడలు వేసుకోవాలి. అందుకే చాలా మంది వీటిని ఇంట్లో చేయడం మానేస్తుంటారు. ఒకవేళ తినాలనిపిస్తే హోటల్‌కు వెళ్లడమో, ఇంటికే ఆర్డర్ పెట్టుకోవడం చేస్తుంటారు. అయితే ఇకపై వడలు తినాలనిపిస్తే గంటల గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా కేవలం నిమిషాల్లోనే మరమరాలతో సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే వడలు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా టేస్ట్ మినప వడలను మించి ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మరమరాలు - ఒకటిన్నర కప్పులు
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి -2
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు- రుచికి సరిపడా
- కారం - అర టీ స్పూన్
- గరం మసాలా - పావు టీ స్పూన్
- ధనియాల పొడి - పావు టీ స్పూన్
- జీలకర్ర పొడి - పావు టీ స్పూన్
- అల్లం పేస్ట్ - అర టేబుల్ స్పూన్
- బియ్యం పిండి - రెండు చెంచాలు
- మైదా - రెండు చెంచాలు
తయారీ విధానం :
- ముందుగా మరమరాలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి ఓ 5 నిమిషాలు పక్కకు పెట్టాలి.
- ఈ లోపు ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
- మరమరాలు నానిన తర్వాత నీళ్లు లేకుండా పిండుకుంటూ ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మరమరాలను మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి.
- అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యప్పిండి, మైదా వేసుకోవాలి. మైదా ఇష్టం లేకపోతే దాని బదులు శనగపిండి వేసుకోవాలి.
- ఇలా వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం మరమరాలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ మరమరాలను ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి.
- అలా కలుపుకున్న తర్వాత మరమరాల మిశ్రమాన్ని కొంచెం తీసుకుని ఉండలాగ చేసి అరచేతిలో పెట్టి వడలుగా ఒత్తుకుని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మరమరాల మిశ్రమాన్ని మొత్తం వడలుగా ఒత్తుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
- నూనె బాగా కాలిన తర్వాత ముందే సిద్ధం చేసుకున్న వడలను నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా తయారు చేసిన వడలన్నింటినీ నూనెలో వేసి కాల్చుకోవాలి.
- అంతే ఎంతో టేస్టీగా ఉండే మరమరాల వడలు రెడీ. కేవలం నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ వడలను ఏదైనా చట్నీతో లేదా విడిగా తిన్నా అద్దిరిపోతాయి. నచ్చితే మీరూ ట్రై చేసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌కు సూపర్ ఆప్షన్.
ఉప్మా రవ్వతో నిమిషాల్లోనే వడలు! - టేస్ట్ అద్దిరిపోతుంది - ప్రాసెస్ చాలా ఈజీ!