Easy Kitchen Tools :మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఉపయోగించే వస్తువుల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఎక్కువ మంది పాత వాటిని వాడుకుంటూనే.. కొత్త వాటిని కొనుగోలు చేస్తుంటారు. మనం వంటింట్లో రోజూ వాడుకునే పాత్రలు, వస్తువుల్లో ఎక్కువగానే మార్పులు కనిపిస్తున్నాయి. కిచెన్లో పనులు సులభంగా అయ్యేలా వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడూ కొత్త వస్తువులు తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చి ఎక్కువగా అమ్ముడుపోతున్న కిచెన్ పరికరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈజీగా నిమ్మరసం పిండొచ్చు
మనలో చాలా మందికి లెమన్ రైస్, జ్యూస్ అంటే ఎంతో ఇష్టం. కానీ నిమ్మరసం పిండడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఇందుకోసం ఎక్కువగా స్క్వీజర్‌ను వాడుతుంటారు. ఈ సమయంలో స్క్వీజర్‌తో ఎంత గట్టిగా ఒత్తినప్పటికీ ఎంతో కొంత రసం ఇంకా మిగిలే ఉంటుంది. ఆ తర్వాత చేత్తో నిమ్మకాయను తీసుకుని పిండితే కానీ పూర్తిగా రసం రాదు. కానీ, పోర్టబుల్ లెమన్ స్క్వీజర్‌తో ఈ శ్రమంతా ఉండదు. దీనిని స్లిమ్‌లైన్ డిజైన్‌తో తయారు చేశారు. దీనివల్ల నిమ్మకాయలోని రసమంతా ఒకేసారి పిండేయొచ్చు. అంతే కాదు మీరు ఈ స్క్వీజర్‌తో ఆరెంజ్, బత్తాయి లాంటివీ ముక్కలుగా కట్ చేసి సులువుగా రసం తీసుకోవచ్చు.
కజ్జికాయలు చేయడం ఇక సులభం
పండగలు, ఉత్సవాలు, శుభకార్యాల సందర్భంగా చాలా మంది ఇళ్లలో కజ్జికాయలు చేస్తుంటారు. అయితే, కజ్జికాయలను చాలా సులభంగా చేసుకోవడానికి మీకు ఆటోమేటిక్ డంప్లింగ్ మేకర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పరికరం సహాయంతో ఒకేసారి మీరు రెండు కజ్జికాయలను చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు తయారు చేసిన చపాతీలు రెండింటిని ట్రేల్లో పెట్టాలి. ఆ తర్వాత వాటిమీద కొద్దిగా పొడిపిండి చల్లి అందులో స్టఫ్ పెట్టేసుకుని బటన్ నొక్కితే చాలు. ఒకేసారి రెండు కజ్జికాయలు తయారైపోతాయి. దీనితో మీరు డంప్లింగ్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు.