Navratri 2024 Special Recipes :దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో దుర్గామాతకు పూజలు చేస్తున్నారు. అలాగే ఏరోజుకారోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సిద్ధం చేసి నివేదిస్తుంటారు. అలాంటి వాటిల్లో అమ్మవారికి ఇష్టమైన.. కొబ్బరి పూర్ణంబూరెలు, చక్కెర పొంగలి అనే రెండు ప్రత్యేకమైన రెసిపీలు తీసుకొచ్చాం. మరి, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొబ్బరి పూర్ణంబూరెలకు కావాల్సిన పదార్థాలు :
- కప్పు - బియ్యం
- అరకప్పు - మినప్పప్పు
- మూడు కప్పులు - తాజా కొబ్బరి తురుము
- ఒకటిన్నర కప్పు - బెల్లం తరుగు
- అరచెంచా - యాలకుల పొడి
- వేయించేందుకు సరిపడా - నూనె
- అరచెంచా - ఉప్పు
- రెండు చెంచాలు - నెయ్యి
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మినప్పప్పును తీసుకొని ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఈ రెండింటినీ శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లోకి తీసుకొని చిక్కని దోశపిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై అందులో ఉప్పు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని బెల్లం తరుగు, కొబ్బరి తురుము వేసుకోవాలి.
- తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగి ఆ మిశ్రమం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ వేడి చేసుకోవాలి.
- ఆ విధంగా అయ్యాక అందులో యాలకుల పొడి వేసి కడాయిని దింపేసుకొని ఆ మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి.
- తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని పూర్ణాలు వేయించడానికి సరిపడా వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక.. ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చిన్న చిన్న ఉండలను ఒక్కొక్కటిగా తీసుకంటూ దోశపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి.