Dondakaya PachiKaram in Telugu :కొంతమంది దొండకాయ కర్రీ, ఫ్రై ఏది చేసినా ఎంతో ఇష్టంగా తింటారు. కానీ.. మరి కొంతమంది ఇందుకు పూర్తి భిన్నం. దొండకాయ కర్రీ ఎంత బాగున్నా అస్సలు టేస్ట్ చేయరు. అయితే, ఇలాంటి వారు ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా "దొండకాయ పచ్చికారం" ట్రై చేయండి. ఈ పద్ధతిలో కూర వండితే వద్దన్న వారు కూడా కర్రీ మరోసారి వేసుకుని ఇష్టంగా లాగిస్తారు. ఈ కర్రీఅన్నంతో పాటు, చపాతీలు, పుల్కాల్లోకి టేస్ట్ అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే.. మరి ఇక ఆలస్యం చేయకుండా దొండకాయ పచ్చికారం ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- లేత దొండకాయలు - పావు కేజీ
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- పచ్చిమిర్చి - 5
- ఉల్లిపాయ-1
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఉప్పు - రుచికి సరిపడా
- వాటర్-సరిపడా
- పసుపు - అర టీ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పెరుగు-2 టేబుల్స్పూన్లు
- ధనియాల పొడి- టీస్పూన్
- కారం- అరటీస్పూన్
- గరం మసాలా- అరటీస్పూన్
- కసూరీ మేథి -కొద్దిగా
తయారీ విధానం:
- ముందుగా కర్రీ కోసం.. దొండకాయలను శుభ్రంగా కడిగి చివర్లు కట్ చేసి పొడుగ్గా, సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
- ఆపై గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు 3 నిమిషాలు ఫ్రై చేయండి.
- తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
- ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నదొండకాయ ముక్కలు వేసి మిక్స్ చేయండి. కర్రీ మాడిపోకుండా ఉండడానికి కొన్ని నీళ్లు పోసి.. గిన్నెపై మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి.
- దొండకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో పెరుగు వేసి మిక్స్ చేయండి. ఆపై కారం, ధనియాలపొడి, గరం మసాలా వేసి బాగా కలపండి.
- ఇప్పుడు మీకు గ్రేవీకి సరిపడా అరకప్పు నుంచి పావు కప్పు వరకు వాటర్ పోసుకుని కలిపి మూత పెట్టండి.
- ఓ నాలుగు నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు, కసూరీ మేథి చేతితో నలిపి వేయండి.
- అంతే ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చికారం మీ ముందుంటుంది. ఈ కర్రీ వేడివేడి అన్నం, చపాతీల్లోకి రుచి అద్భుతంగా ఉంటుంది. నచ్చితే ఇలా ఓ సారి దొండకాయ కర్రీ ట్రై చేయండి.