Cleaning Tips for Ceramic Utensils : ప్రస్తుత రోజుల్లో చాలా మంది నాన్‌స్టిక్ పాత్రలతో పాటు సెరామిక్ కుక్‌వేర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి చూడటానికి అందంగా ఉండటంతో పాటు వండేందుకూ అనుకూలం. ముఖ్యంగా ఇంటికి బంధువులొచ్చినప్పుడు వీటిల్లో వడ్డించడం ద్వారా హుందాతనం ఉట్టిపడుతుంది. ఈ పాత్రల్లో భోజనం చేయడం కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే, వీటిని వాడడం వరకే కాదు శుభ్రపరిచే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నుతాయని చెబుతున్నారు. ఇంతకీ, సెరామిక్ వంట పాత్రల్ని ఎలా శుభ్రం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
- కొంతమంది టైమ్ లేకపోవడం వల్లో లేదంటే త్వరగా పని కంప్లీట్ అవ్వాలన్న ఉద్దేశంతోనో సెరామిక్ పాత్రల్ని వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేస్తుంటారు. వాటర్ ట్యాప్ కింద పెడితే అవే చల్లబడతాయనుకుంటారు. అయితే, ఇలా ఉన్నట్లుండి టెంపరేచర్లో మార్పు రావడం వల్ల వాటిపై ఉండే నాన్స్టిక్సెరామిక్ కోటింగ్ తొలగిపోతుందంటున్నారు నిపుణులు. కాబట్టి, వంట పూర్తయ్యాక అవి సాధారణ గది ఉష్ణోగ్రత వద్దకొచ్చాక మాత్రమే వాటిని క్లీన్ చేయాలని సూచిస్తున్నారు.
- వంట త్వరగా పూర్తవ్వాలన్న ఉద్దేశంతో కొందరు ఎక్కువ మంట మీద వంట చేస్తుంటారు. అయితే, సెరామిక్ పాత్రల్ని ఇలా పెద్ద మంటపై ఉంచితే వాటిలోని నాన్‌స్టిక్ కోటింగ్ త్వరగా పోతుందని గుర్తుంచుకోవాలి. అందుకే, ఈ పాత్రల్లో చిన్న మంట పైనే వంట చేయడం మంచిదంటున్నారు నిపుణులు.
- సెరామిక్ పాత్రలపై కొన్నిసార్లు పసుపు మరకలు పడుతుంటాయి. అవి అంత ఈజీగా తొలగిపోవు. అలాంటి టైమ్‌లో మరకలు ఉన్న పాత్రలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసి అరగంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత డిటర్జెంట్‌తో క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
ఎంత శుభ్రం చేసినా పాత్రల్లో పసుపు మరకలు పోవడం లేదా ? ఇలా చేస్తే చిటికెలో సాల్వ్!
- నార్మల్‌గా సెరామిక్ వంట పాత్రలపై ఉన్న నాన్‌స్టిక్ కోటింగ్ అందులో వండే పదార్థాల్ని మాడిపోనివ్వదు. అయినా మాడిపోకుండా ముందే వెన్న పూయడం వంటివి చేయాలంటున్నారు.
- ఒకవేళ సెరామిక్ పాత్రలు మాడిపోయినట్లయితే ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం మాడిపోయిన పాత్రలో కొద్దిగా పొడి బేకింగ్ సోడాను చల్లాలి. ఆపై మృదువుగా ఉన్న స్పాంజితో గుండ్రంగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత సాధారణ డిటర్జెంట్‌తో కడిగేస్తే సరిపోతుందంటున్నారు. లేదంటే ఈ పాత్రల్ని బేకింగ్ సోడా, గోరువెచ్చటి నీళ్ల మిశ్రమంతో శుభ్రం చేసినా గుడ్ రిజల్ట్ ఉంటుందంటున్నారు.
- మరో టిప్ ఏంటంటే, ఒక పాత్రలో ఒక వంతు వెనిగర్‌కు నాలుగు వంతుల వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని శుభ్రం చేయాల్సిన సెరామిక్ పాత్రలో పోసి రాత్రంతా నానబెట్టాలి. మార్నింగ్ సబ్బుతో క్లీన్ చేస్తే సరి. వంట చేసే క్రమంలో వాటిపై ఏర్పడిన మరకలు, జిడ్డుదనం అన్నీ తొలగిపోయి కొత్తవాటిలా మెరుస్తాయంటున్నారు నిపుణులు.