Bitter gourd Onion Fry Recipe :ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో కాకరకాయ కూడా ఒకటి. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. అయితే, చాలా మంది ఇంట్లో కాకరకాయ వండితే అస్సలు తినరు. కాకరకాయను ఎలా వండినా కూడా కర్రీ కాస్త చేదుగా ఉండడంతో తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే, ఒక్కసారి "కాకరకాయ ఉల్లికారం" ఈ విధంగా చేశారంటే.. కాకరకాయను ఇష్టపడని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఇది చేదు కూడా ఉండదు. వేడివేడి అన్నంలో పప్పు చారు, సాంబార్, రసంతో కలిపి తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా ఈ కాకరకాయ ఉల్లికారం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- లేత కాకరకాయలు- అరకేజీ
- ఉల్లిపాయలు- పావుకేజీ
- పసుపు-టీస్పూన్
- జీలకర్ర-టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు-8
- కారం-2 టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు-రెమ్మ
- నూనె- సరిపడా
తయారీ విధానం :
- ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి చెక్కు తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వాటి చివర్లు కట్ చేసుకుని కొంచెం పెద్ద సైజ్‌లో రౌండ్‌గా ముక్కలు కట్ చేసుకోవాలి.
- ఈ ముక్కలను గిన్నెలోకి తీసుకుని కొద్దిగా, పసుపు, ఉప్పు పట్టించి.. అరగంటసేపు పక్కన పెట్టుకోండి.
- ఇలా చేయడం వల్ల కాకరకాయలో నీరంతా దిగుతుంది. మరొసారి చేతితో పిండితే కాయల్లోని చేదు మొత్తం పోతుంది. తీసి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- తర్వాత పాన్‌లో ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలను 5 నిమిషాలు వేపి పక్కన తీసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే.. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసుకున్న కాకరకాయ లోపల గింజలను తీసేయండి. ఇందులో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, కారం పేస్ట్‌ని స్టఫ్ చేయండి.
- కాకరకాయలు వేపుకున్న గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కారం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసుకుని వేపుకోండి. అలాగే మిగిలిన ఉల్లిపాయ, కారం పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి.
- ఉల్లిపాయల్లోని నీరు మొత్తం పోయి ఉల్లికారం ఎర్రగా మారడానికి దాదాపు 20 నిమిషాల టైమ్ పడుతుంది. చివరిగా కాకరకాయ ఉల్లికారం దింపేసుకునే ముందు కరివేపాకు రెమ్మ వేసుకుంటే సరిపోతుంది.
- ఒక్కసారి కాకరకాయలతో ఈ విధంగా ఉల్లికారం రెసిపీ చేసుకుని తిన్నారంటే.. మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. నచ్చితే మీరు కూడా సరికొత్తగా ఈ రెసిపీని ట్రై చేయండి.