How to Make Kakarakaya Kaju Fry :ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో కాకరకాయ ముందు వరసలో ఉంటుంది. కానీ, చాలా మంది కాకరను తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకు ముఖ్య కారణం చేదు అని చెప్పుకోవచ్చు. అయితే, ఓసారి కాకరతో ఈ అద్భుతమైన రెసిపీని ట్రై చేయండి. అదే.. "కాకరకాయ కాజు ఫ్రై". దీన్ని ఈ టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నారంటే చేదు తగ్గి సూపర్ టేస్టీగా వస్తుంది. అప్పుడు కాకరకాయచేదు అనేవారే ఇంకా ఇంకా కావాలని అడిగి మరీ తినేస్తారు చూడండి. అయితే, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కాకరకాయలు - 6(మీడియం సైజ్‌వి)
- పసుపు - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - 7 టేబుల్‌స్పూన్లు
- జీడిపప్పు - ముప్పావు కప్పు
- ధనియాలు - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 2 టీస్పూన్లు
- ఎండుమిర్చి - 3
- ఎండుకొబ్బరి పొడి - 3 టేబుల్‌స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 15 నుంచి 20
- కారం - తగినంత
- చింతపండు - గోలి సైజంత
- ఆవాలు - 1 టీస్పూన్
- ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్ది)
- కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పీలర్ లేదా చాకు సహాయంతో కాకరకాయలపై ఉండే చెక్కును తొలగించుకోవాలి. తర్వాత చెక్కు తీసిన కాకరకాయలను పావు అంగుళం మందంతో చక్రాల్లా కట్ చేసుకోవాలి.
- ఆపై వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కోట్ చేసి కనీసం అరగంట నుంచి గంట పాటు ఊరనివ్వాలి.
- అనంతరం ఉప్పులో ఊరిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని చేతితో గట్టిగా పిండి మరో బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాకరలో చేదుగా ఉండేటువంటి పసరు దిగిపోయి చేదు తగ్గుతుంది.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని 3 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసుకోవాలి.
- తర్వాత అదే కడాయిలో మిగిలిన నూనెలో ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, ఎండుమిర్చిని తుంపి వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- ఎండుమిర్చి రంగు మారి పొంగిన తర్వాత ఎండుకొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలూ వేసుకొని కొబ్బరి పొడి ఎర్రగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ధనియాల మిశ్రమం, ఉప్పు, కారం వేసుకొని ముందు కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో పావు కప్పు వేయించిన జీడిపప్పు, చింతపండు వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. అయితే, ఈ మిశ్రమాన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా అక్కడక్కడ జీడిపప్పు పలుకులు పంటికి తగిలేలా ఉండేలా చూసుకోవాలి.
- అనంతరం అదే కడాయిలో మరో 4 టేబుల్స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
- తర్వాత కాస్త మందంగా, చీలికలుగా తరుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆపై పసరు పిండి పక్కన ఉంచుకున్న కాకరకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
- అనంతరం కడాయిపై ప్లేట్ పెట్టేసి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక కాకర రంగు మారి కాస్త మెత్తబడుతుంది. అప్పుడు మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు కారం, వేయించుకున్న మిగిలిన జీడిపప్పు పలుకులు ఆ మిశ్రమంలో వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు వేయించుకొని దింపుసేకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "కాకరకాయ కాజు ఫ్రై" రెడీ!