Bengali Style Fish Curry :సండే కోసం నాన్‌వెజ్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆదివారం రోజున ఇంట్లో తప్పకుండా చికెన్, మటన్‌తో చేసిన వంటకాలు చేసుకుని తింటారు. అయితే, ఈ సండేనాడు ఎప్పుడూ చికెన్, మటన్ కాకుండా చేపలతో కొత్త రెసిపీ ఒకటి ప్రిపేర్ చేయండి. అది కూడా బెంగాలీ స్టైల్లో చేపల పులుసు చేయండి. మన దగ్గర చేసే చేపల పులుసులానే ఈ రకం చేపల పులుసు టేస్ట్ అద్దిరిపోతుంది. దీనిని చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన బెంగాలీ స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- చేప ముక్కలు-అరకేజీ
- పొటాటోలు-3
- కారం - రుచికి సరిపడా
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - టీ స్పూన్
- అల్లం ముక్కలు-4 చిన్నవి
- ఎండుమిర్చి-8
- టమాటాలు-3
- ఆవాల నూనె-అరకప్పు
- ఉల్లిపాయలు - 2
- జీలకర్ర పొడి- టీ స్పూన్
- ధనియాలపొడి- అర టీ స్పూన్
- కశ్మీరి కారం- అర టీ స్పూన్
- పచ్చిమిర్చి -4
- పసుపు - కొద్దిగా
- బిర్యానీ ఆకులు-3
- కలోంజి సీడ్స్- పావు టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం..
- ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసి మసాలా మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించాలి.
- తర్వాత మిక్సీ జార్లోకి జీలకర్ర, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు పోసి మరొసారి గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో టమాటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- తర్వాత పొటాటోలపైన చెక్కు తీయండి. వాటిని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి ఆవాల నూనె వేసుకోండి. (మీకు అచ్చం బెంగాలీ స్టైల్ చేపల కూర రుచి రావాలంటే.. ఆవాల నూనె మాత్రమే యూజ్ చేయాలి.)
- నూనె వేడైన తర్వాత చేప ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోండి.
- రెండువైపులా చేప ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే నూనెలో బంగాళాదుంప ముక్కలు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోండి.
- పాన్‌లో నుంచి పావు కప్పు ఆయిల్ తీసేయండి.(ఈ నూనెను ఇతర వంటలకు వాడుకోవచ్చు)
- ఇప్పుడు పాన్‌లో బిర్యానీ ఆకులు, కలోంజి సీడ్స్, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న అల్లం ఎండు మిర్చి పేస్ట్ వేసి కలపండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి.
- తర్వాత కొద్దిగా పంచదార వేసి కలపండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం, ధనియాలపొడి, కశ్మీరి కారం, కొన్ని నీళ్లు పోసి కలపండి.
- మసాలా మిశ్రమం కాస్త వేగిన తర్వాత వేపుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి కలపండి.
- తర్వాత వేడేవేడి నీళ్లు రెండు గ్లాసులు పోసి మూత పెట్టి మరిగించండి.
- ఐదు నిమిషాల తర్వాత వేపుకున్న చేప ముక్కలను వేసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోండి.
- నూనె పైకి తేలిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసి స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా చేసుకుంటే వేడివేడిగా ఎంతో ఘుమఘుమలాడే బెంగాలీ స్టైల్ చేపల పులుసు రెడీ. నచ్చితే మీరు కూడా ఇలా చేపల పులుసు ట్రై చేయండి.
నోరూరించే "ఆంధ్ర స్టైల్ చేపల పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ కేక అంతే!
ఫిష్ పులుసు పెట్టాలంటే చేపలే ఉండాలా ఏంటి? - వీటితో పులుసు పెడితే వహ్వా అనాల్సిందే!