Health Benefits Of Baking Soda :ప్రతీ ఒక్కరి వంటింట్లో కనిపించే ఆహార పదార్థాలలో ఒకటి.. బేకింగ్ సోడా. ఏదైనా పిండి వంటకాలు చేసుకుంటున్నప్పుడైతే అది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ బేకింగ్ సోడానే సోడియం బైకార్బోనేట్, వంటసోడా అని కూడా పిలుస్తారు. అయితే.. వంటసోడా వంటలకు మంచి రుచిని ఇవ్వడం మాత్రమే కాదు.. దాంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ, బేకింగ్ సోడాను(Baking Soda) ఎలా ఉపయోగిస్తే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంచి మౌత్ వాష్ : మనం తింటున్న స్పైసీ ఫుడ్స్ కీ, తాగుతున్న కాఫీ టీలకీ కేవలం రెండు పూటలా దంతాలు బ్రష్ చేసుకుంటే సరిపోదు. మౌత్ వాష్ కూడా అవసరం అవుతుంది. అలాంటి టైమ్‌లో ప్రత్యేకంగా మౌత్ వాష్ కొనాల్సిన పనిలేదు. గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి మౌత్ వాష్ లా యూజ్ చేయొచ్చు. ఇది నోటి పుళ్ళని తగ్గించడమే కాకుండా దంతాలు తెల్లగా మెరిసేటట్లు చేస్తుందంటున్నారు డాక్టర్ కె. శివరాజు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్. అలాగే.. శరీరం నుంచి వచ్చే దుర్వాసనకు బేకింగ్ సోడా వాడటం ద్వారా చెక్ పెట్టొచ్చంటున్నారు.
కిడ్నీ ఆరోగ్యానికి మేలు : క్రానిక్ కిడ్నీ డిసీజెస్ నెమ్మదిగా కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనంలో బేకింగ్ సోడా సప్లిమెంట్లు తీసుకునే వారు ముప్ఫై ఆరు శాతం తక్కువ స్పీడ్‌తో కిడ్నీ ఫెయిల్యూర్ దశ కి చేరుకుంటారని తేలింది. ఇందుకు బేకింగ్ సోడాలోని సోడియం బైకార్బొనేట్ చాలా బాగా ఉపకరిస్తుందట. అందుకే బేకింగ్ సోడా కొద్ది మొత్తంలో ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు డాక్టర్ శివరాజు.
జీర్ణ సమస్యలకు చెక్ : మనం కొన్నిసార్లు ఎక్కువ తిన్నా, సరిగ్గా అరక్కపోయినా, గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ఆ మంట పొట్టలో నుంచి గొంతు వరకూ తెలుస్తుంది. అలాంటి టైమ్‌లో ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకొని నెమ్మదిగా తాగితే గుండెల్లో మంట(National Library of Medicine రిపోర్టు)నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందంటున్నారు వైద్యులు. అలాగే.. ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి వాటి నుంచి వేగంగా రిలీఫ్ పొందవచ్చంటున్నారు.
చర్మ సమస్యలు దూరం : దోమకుట్టిన ప్రాంతంలో దద్దుర్లు, దురద, ఎర్రదనాన్ని పోగొట్టడంలో బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు డాక్టర్ శివరాజు. ఇందుకోసం మూడు వంతుల బేకింగ్ సోడాను ఒకవంతు నీటిలో కలిసి దోమకుట్టిన ప్రదేశంలో అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. అలాగే.. నొప్పిని, మంటను తగ్గించే గుణం కూడా బేకింగ్ సోడాకు ఉందని చెబుతున్నారు.