How to Cure Dry Feet Skin: చలికాలంలో చాలా మందికి అనేక చర్మ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కొంతమందికి కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మం పొడిబారి పొలుసుల్లా మారిపోతుంటుంది. అయితే, ఇది కేవలం చలికాలంలోనే కాకుండా సీజన్‌తో సంబంధం లేకుండానే ఎదురవుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పొడిబారిన, పెళుసుబారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరినూనె:కొద్దిగా కొబ్బరినూనెను తీసుకొని చర్మపు పొరల్లోకి ఇంకే వరకు పాదాలపై మృదువుగా మసాజ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా రాత్రంతా పాదాలను ఇలానే వదిలేసి నిద్రపోవాలని ఫలితంగా కొద్ది రోజుల్లోనే పాదాలపై చర్మం తిరిగి కోమలంగా మారుతుందని అంటున్నారు. ఇంకా పొడిబారిన, పెళుసుబారిన చర్మానికి కొబ్బరినూనె తగినంత తేమని అందించి తిరిగి మృదువుగా మారుస్తుందని వివరిస్తున్నారు. 2018లో Journal of Cosmetic Scienceలో ప్రచురితమైన "Moisturizing and Anti-Inflammatory Effects of Coconut Oil on Dry Skin" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
తేనె:సమస్యకు తేనెతో కూడా పరిష్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొడిగా మారిన పాదాలకు తేనెను అప్లై చేసి రెండు లేదా మూడు నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలని వివరిస్తున్నారు. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి నీళ్లతో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమను అందించడంతో పాటు మృదువుగానూ మార్చుతుందని తెలిపారు.
కలబంద: చర్మ సంరక్షణకు చాలా మంది కలబందను వినియోగిస్తుంటారు. కొద్దిగా కలబంద గుజ్జు తీసుకొని పాదాలకు అప్లై చేసి.. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా రోజుకి రెండుసార్ల చొప్పున క్రమం తప్పకుండా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పాదాలు కోమలంగా మారతాయని చెబుతున్నారు.