Home Remedies To Get Natural Pink Lips :'చెలి అధరాలు లేత పూ రేకులు..'' దొండ పండు లాంటి పెదవే నీదీ.. అంటూ పెదాల అందాన్ని ఎందరో సినీకవులు వివిధ రకాలుగా వర్ణించడం మనం చూశాం. అయితే, అంత అందమైన పెదాలను అందంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే కదా? ఎండలో ఎక్కువగా తిరగడం, లిప్‌స్టిక్‌లు అతిగా వాడటం, కాఫీ, టీలు ఎక్కువసార్లు తీసుకోవడం... వాంటి వాటివల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. ఈ సమస్యను ఎలా అధిగమించాలి? నిపుణులు ఏం అంటున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే ఇలా ట్రై చేయండి : పెదాలపై కాస్త నలుపు తగ్గాలంటే బీట్‌రూట్ జ్యూస్, దానిమ్మ గుజ్జుతో పాటుగా కొత్తిమీర రసాన్ని రోజూ పెదాలపైన రాస్తూ ఉండాలని నిపుణలు చెబుతున్నారు. వీటిని వాడటం ద్వారా పెదాలు ఎర్రగా మారే అవకాశాలుంటాయంటున్నారు. దీంతో పాటు తేనె, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి రాసుకోవడం వల్ల నలుపు రంగు తగ్గుతుందని సూచిస్తున్నారు.
మాయిశ్చరైజేషన్ :పెదాలకు తగినంత తేమ లేకపోవడం వల్ల కూడా నల్లగా మారతాయంటున్నారు నిపుణులు. దీనికోసం లిప్ బామ్, బాదం నూనెని అప్లై చేయడం వల్ల పెదాలకు తగినంత తేమ అందుతుందని సూచిస్తున్నారు. దాంతో పాటు రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగితే మంచి ఫలితాలుంటాయని సూచిస్తున్నారు.
స్క్రబింగ్ :ఒక్క వేళ మీపెదాలకు స్క్రబింగ్ ఏంటనుకుంటున్నారా? స్క్రబింగ్ అంటే చర్మానికి చేసినట్టు కాకున్నా 'ఎక్స్‌ఫోలియేషన్' చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదెలా అంటే... మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్ తీసుకోవాలి. పెదాలను కాస్త తడి చేసుకొని, ఆ తరువాత ఆ బ్రష్‌తో పెదాలను రుద్దాలి. తర్వాత లిప్ బామ్ రాసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు చేయడం వల్ల పెదాలు అందంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.