Good Habits For Healthy Week : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకూ ఇల్లు, ఆఫీసు అంటూ క్షణం తీరిక ఉండటంలేదు. ఈ బిజీలో మీ ఆరోగ్య పరిరక్షణను మర్చిపోతున్నారు. నిద్రలేచిన వెంటనే క్యాలెండర్‌లో తేదీ మారుస్తుంటాం కదా!. దానికి అనుసంధానంగా వారమంతా రోజువారీగా చేసే కొన్ని అలవాట్లు మన అందాన్నీ, ఆరోగ్యాన్నీ కాపాడతాయంటున్నారు నిపుణులు. అవేంటంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మైండ్‌ఫుల్ మండే
వారం ప్రారంభంలో వచ్చే రోజు మండే ఒత్తిడిని దూరం చేయడానికి ఉపయో గించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనసంతా ప్రశాంతంగా ఉండేలా కనీసం 20 నిమిషాలపాటు ధ్యానం చేయాలని సూచిస్తున్నారు. గార్డెన్‌లో లేదా ఆరుబయట బాల్కనీలో ఉదయంపూట వీచే గాలుల మధ్య ధ్యానం చేస్తే.. మెదడును సానుకూలతతో నింపుతుందంటున్నారు. ఏ సమస్యనైనా తేలికగా పరిష్కరించేలా మనసును సిద్ధం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
టెక్-ఫ్రీ ట్యూస్‌డే
ఇక ట్యూస్‌డే రోజున గృహిణులైతే రోజంతా చాటింగ్, రీల్స్ చూడటం, ఫోన్‌లో సినిమాలు వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్స్‌పై పనిచేసే ఉద్యోగినులైతే సాంకేతికతను వినియోగించడం తప్పనిసరి అవుతుందని, దాంతో వీళ్లు కనీసం వ్యక్తిగతంగా ఫోన్ వినియోగించడాన్ని ఈ ఒక్క రోజైనా దూరం పెట్టాలని చెబుతున్నారు. ఆ సమయాన్ని ప్రకృతిని ఆస్వాదించడానికి, పుస్తకపఠనం, వంటివాటికి ఉపయోగించడం ద్వారా ఒత్తిడి ఆందోళనకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వెల్‌నెస్ వెన్స్‌డే
శారీరక సామర్థ్యానికి పెద్దపీట వేసే రోజు వెన్స్‌డే. వాకింగ్, యోగా, కొత్తగా ఏదైనా వర్కవుట్ లాంటి వ్యాయామాలకు ఈ రోజులో అరగంట కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కండరాలు బలపడటంతో పాటుగా శక్తిసామర్థ్యాలు మెరుగుపడతాయంటున్నారు.
థాంక్‌ఫుల్ థర్స్‌డే
ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తే థర్స్‌డే రోజు చెప్పేయండి. మీ మనసులో ఎవరెవరు ఉన్నారో, మీ సంతోషానికి కారణం అయ్యారో వారి పేర్లను వరుసగా రాసుకోవాలి. దగ్గరలో ఉంటే వెళ్లి కలిసి కృతజ్ఞతలు చెప్పి చూడాలని నిపుణులు చెబుతున్నారు. దూరంగా ఉంటే ఫోన్ చేసి పలకరించి, వారివల్ల మీరు పొందిన ఆనందాన్ని గుర్తుకు తెచ్చి థ్యాంక్స్ చెప్పండంటున్నారు. మనసెంత తేలికపడుతుందో మీకే తెలుస్తుందని, దీనివల్ల మీ మానసికారోగ్యం మరింత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.