Youth Died In US Police Firing In Chicago : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి నల్లజాతీయుడిపై పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. కారులో ఉన్న నల్లజాతీయుడిపై పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు. కేవలం 41 సెకన్ల వ్యవధిలో 100 బుల్లెట్లను అతడి కారుపై ప్రయోగించినట్లు తాజాగా బయటకొచ్చిన వీడియో ద్వారా తెలుస్తోంది. పోలీసుల కాల్పుల్లో 26 ఏళ్ల రీడ్ అనే నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని షికాగోలో మార్చి నెలలో జరగ్గా దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకొచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
పోలీసు వాహనంలో ఉన్న ఐదుగురు పోలీసు అధికారులు సీట్‌బెల్ట్ ధరించలేదని డెక్స్టర్ రీడ్(26) నడుపుతున్న ఎస్‌యూవీని చుట్టుముట్టారు. అప్పుడు కారు కిటికీని పైకి లేపాడు రీడ్. ఎక్కువ మంది అధికారులు రావడం వల్ల కారులో నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించాడు. దీంతో రీడ్‌పై పోలీసులు కాల్పులు జరపగా అతడు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి.
పోలీసుల కాల్పుల్లో మరణించిన 26 ఏళ్ల డెక్స్టర్ రీడ్ అయితే తొలుత రీడే పోలీసులపై కాల్పులు జరిపాడని అధికారులు చెబుతున్నారు. షికాగోలోని హంబోల్ట్ పార్క్ పరిసరాల్లో రీడ్ జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. అప్పుడు మిగిలిన నలుగురు అధికారులు రీడ్‌పై కాల్పులు జరిపారని అన్నారు. మార్చి 21న పోలీసులు, రీడ్ మధ్య పరస్పరం దాడి జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ లారీ స్నెల్లింగ్ చెప్పారు.
కేసుపై త్వరగా విచారణ జరగాలి : రీడ్ తరఫు లాయర్లు
మంగళవారం బయటకొచ్చిన ఈ కాల్పుల వీడియోను చూసిన రీడ్ కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. రీడ్ కుటుంబీకులు వీడియోను చూసి మానసికంగా కుంగిపోయారని అతడి తరఫు న్యాయవాది ఆండ్రూ ఎం, స్ట్రోత్ తెలిపారు. రీడ్‌పై కాల్పులు జరిపినవారు పోలీసులమని ఎక్కడా ప్రకటించలేదని చెప్పారు. త్వరితగతిన ఈ కేసుపై విచారణ జరగాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. రీడ్‌ను తిరిగి తీసుకురాలేమని, ఇలాంటి ఘటన మరొక కుటుంబానికి జరగకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని లాయర్లు చెప్పారు. 'నేను, నా కుటుంబం పడుతున్న బాధ వర్ణించలేనిది. రీడ్ మా కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్యక్తి' అని రీడ్ సోదరి పోర్బ్సా బ్యాంక్స్ విలేకరులతో చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.
'దర్యాప్తునకు సహకరిస్తాం'
రీడ్ మృతిపై దర్యాప్తునకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధాలా సహకరిస్తుందని పోలీసు ప్రతినిధి థామస్ అహెర్న్ తెలిపారు. దర్యాప్తులో వాస్తవాలు తెలిసేవరకు ఏ నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. కాగా, రీడ్ పోలీసులపై కాల్పులు జరిపినట్లు వీడియోలో కనిపించలేదు. అయితే రీడ్ వాహనంలో నుంచే పోలీసులు తుపాకీని తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. రీడ్ వాహనంలోకి డజన్ల కొద్ది బుల్లెట్లు దూసుకెళ్లినట్లు వీడియోలో కనిపించింది.
'దైవ కణం' కనుగొన్న బ్రిటన్ సైంటిస్ట్ పీటర్ హిగ్స్ కన్నుమూత - God Particle Scientist Higgs Died
కలరా భయంతో పడవలో 130మంది జర్నీ- నీటమునిగి 90మందికిపైగా మృతి - Mozambique Boat Accident