తెలంగాణ

telangana

ETV Bharat / international

త్వరలో బ్రిటన్‌కు కొత్త రాజు-రాణి? - WILL BRITAIN HAVE A NEW KING SOON

బ్రిటన్ యువరాజు విలియం, కేట్‌ మిడిల్టన్‌ దంపతులకు కొత్త బాధ్యతలు - త్వరలోనే సింహాసనం ఎక్కే ఛాన్స్‌!

William, Kate
William, Kate (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Will Britain Have A New King Soon :త్వరలో బ్రిటన్‌కు కొత్త రాజు-రాణి రాబోతున్నారా? ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ విలియం, కేట్‌ మిడిల్టన్‌ రాజు-రాణిగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారా? ఊహించిన దానికంటే ముందుగానే వారు బ్రిటన్‌ రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించనున్నారా? అంటే రాజ కుటుంబం నుంచి అవుననే సమాధానం వస్తోంది.

కొత్త రాజు-రాణి
బ్రిటన్‌కు కొత్త రాజు-రాణి రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రిన్స్‌ విలియం, ఆయన సతీమణి కేట్‌ మిడిల్టన్‌ రాజు-రాణిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందుగానే సిద్ధమవుతున్నట్లు బ్రిటన్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్‌ కారణంగా రాజు ఛార్లెస్‌-3 ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. బ్రిటన్‌ రాజకిరీటం ధరించేందుకు విలియం సిద్ధమవుతున్నారని రాయల్‌ బయోగ్రాఫర్‌ బెడెల్‌ స్మిత్‌ చెప్పినట్లు పీపుల్‌ మ్యాగజీన్‌లో ఓ కథనం వెలువడింది. ఛార్లెస్‌-3 రాజుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ క్యాన్సర్‌ చికిత్స కారణంగా కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి వస్తోందని పేర్కొంది. అందువల్ల యువరాజు విలియం మరిన్ని అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఊహించిన దానికంటే ముందుగానే విలియం-కేట్‌ బ్రిటన్‌ రాజు-రాణిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కన్పిస్తున్నట్లు పీపుల్‌ మ్యాగజీన్‌ తన కథనంలో పేర్కొంది. వారు కూడా పట్టాభిషేకానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు రాయల్‌ బయోగ్రాఫర్‌ బెడెల్‌ స్మిత్‌ తెలిపారు.

ఛార్లెస్-3 పరిస్థితి ఏమిటి?
రాణి ఎలిజబెత్‌ మరణం తర్వాత ఆమె కుమారుడు ఛార్లెస్‌-3 రాజుగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది మే నెలలో ఆయన పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. 76 ఏళ్ల ఛార్లెస్‌-3 క్యాన్సర్‌ బారినపడిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై రాజకుటుంబంలో ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ఆయన బాధ్యతల్లో మార్పులు జరుగుతున్నాయి. మారిన పరిస్థితుల కారణంగా ఆయన పెద్దకుమారుడి విలియం రాజు ఛార్లెస్‌-3కు బదులుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ నెల 7వ తేదీన పారిస్‌లో జరిగిన ఓ చర్చి పున:ప్రారంభోత్సవానికి విలియం ఒంటరిగా హాజరయ్యారు.

వారసత్వ ప్రణాళిక
వాస్తవానికి 2023 మే నెలలో రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకం జరిగిన తర్వాత నుంచే వారసత్వ ప్రణాళికలను కూడా అధికారికంగా మొదలుపెట్టారు. రాజు అనారోగ్యం వల్ల వారసత్వ ప్రణాళికలను మరింత వేగవంతం చేసినట్లు రాజ కుటుంబవర్గాలు ధ్రువీకరించాయి. కాగా ప్రిన్స్‌ విలియం దంపతులు కూడా కొంత కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. జనవరిలో జరిగిన శస్త్రచికిత్స సమయంలో కేట్‌ మిడిల్టన్‌కు క్యాన్సర్‌ వ్యాధి సోకినట్లు బయపడింది. ఏడాది మొత్తం ఆమె చికిత్స పొందారు. ఆమె కోలుకోవటానికి ఏడాది సమయం పట్టింది. దీంతో యువరాజు విలియం ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయించాల్సి వచ్చింది. కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ జనజీవితంలోకి రావటం వల్ల విలియం దంపతులు కూడా అధికార బాధ్యతల్లో నిమగ్నమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details