Who is Abu Mohammed al-Golani: పశ్చిమాసియా దేశమైన సిరియాలో దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు ఎట్టకేలకు తెరపడింది. అందుకు కారణమైన తిరుగుబాటు దళాలకు నేతృత్వం వహించినదే హయాత్ హయాత్ తహరీర్ అల్-షామ్ (హెచ్‌టీఎస్) సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ అధినేత అబూ మహమ్మద్ అల్-జులానీ ప్రస్థానం అందరిలో ఆసక్తితో పాటు, గుబులూ రేకెత్తిస్తోంది. కారణం ఈ హెచ్‌టీఎస్ నేత ఒకప్పడు అల్‌ఖైదా ఉగ్రవాది కావడమే.
9/11 దాడులే స్ఫూర్తి
సౌదీ అరేబియాలో జన్మించిన 41 ఏళ్ల అల్-జులానీ మూలాలు అల్‌ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. తండ్రి పెట్రోలియం ఇంజినీర్. జులానీ చిన్నతనంలో అతడి కుటుంబం సిరియాలోని డమాస్కస్ సమీపంలో స్థిరపడింది. అమెరికాపై జరిగిన 9/11 దాడులు జులానీని ఉగ్రవాదంవైపు మళ్లేలా చేశాయి. 2003లో జులానీ ఇరాక్ వెళ్లి అల్‌ఖైదాలో చేరాడు.
ఐదేళ్లు అమెరికా జైల్లోనే
అనతికాలంలోనే జులానీ అల్‌ఖైదాలో పేరు తెచ్చుకున్నాడు. అయితే 2006 ఇరాక్‌లోని అమెరికా దళాలు అతడిని అరెస్టు చేశాయి. ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించి బయటకొచ్చాడు. అనంతరం జులానీకి అల్‌ఖైదా కీలక బాధ్యతలు అప్పగించింది. సిరియాలో ఆల్‌ఖైదా అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో జులానీ, అల్ నుస్రా ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాడు.