Indian National Deportation From US : అమెరికా నుంచి 104 మంది భారతీయులతో కూడిన విమానం భారత్ చేరింది. టెక్సాస్ నుంచి వచ్చిన C-17సైనిక విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బుధవారం మధ్యాహ్నం 1.55కు ల్యాండ్ అయింది. అక్రమ వలసదారులని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిలో పంజాబ్‌కు చెందినవారు 30 మంది, హరియాణా, గుజరాత్‌కు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున, ఇద్దరు చండీగఢ్‌కు చెందినవారు ఉన్నారు.
భారత్‌కు వచ్చిన వారిలో 25 మంది మహిళలు, నాలుగేళ్ల చిన్నారి సహా 12మంది మైనర్లు ఉన్నారు. 48 మంది 25 ఏళ్ల లోపువారు ఉన్నారు. టెక్సాస్ నుంచి వచ్చిన అమెరికా సైనిక విమానంలో 11 మంది సిబ్బంది, 45 మంది అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన వారిలో గురుదాస్‌పుర్, అమృత్‌సర్, తర్న్‌తరణ్, జలంధర్, నవాన్ షహర్, పటియాలా, మొహాలీ, సంగ్రూర్ జిల్లాకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
త్వరలో భారత్‌కు మరికొంత మంది!
రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికోకు చెందిన వేలాది మందిని దశలవారీగా స్వదేశాలకు పంపిన అగ్రరాజ్యం- భారత్‌కు చెందిన 17,940 మంది అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించింది. వారిని దశలవారీగా స్వదేశానికి పంపనుంది. తొలి విడతలో 104 మందిని C-17 సైనిక విమానంలో పంపింది. మరో 2,467 ఎన్‌ఫోర్స్‌మెంటు నిర్బంధంలో ఉన్నారు.
మరోవైపు, పంజాబ్‌కు చెందిన వారిలో అనేకమంది డంకీ మార్గాలతోపాటు లక్షలాది రూపాయలు ఖర్చుచేసి అమెరికాలో అక్రమంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది.
'వారిని చట్టబద్ధంగా తీసుకొస్తాం'
ప్రధాని నరేంద్రమోదీ వచ్చేవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో తొలి బృందం భారత్‌కు చేరింది. రెండోసారి ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా సహా విదేశాల్లో అక్రమంగా ఉంటున్న భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటించింది. అక్రమ వలసలకు భారత్ వ్యతిరేకమని, దానివల్ల అనేక సంఘటిత నేరాలకు సంబంధం ఉండే ప్రమాదం ఉందని పేర్కొంది.