Walz And Vance Vice Presidential Debate :అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. మరోవైపు, న్యూయార్క్‌లో సీబీఎస్ న్యూస్ ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి టిమ్ వాల్జ్ మధ్య మంగళవారం డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ఇరువురు ఉపాధ్యక్ష అభ్యర్థులు తమ అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్, కమలకు మద్దతుగా మాట్లాడారు. వారిని ఎన్నుకోమనడానికి గల కారణాలను చర్చలో వివరించారు.
'ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి'
పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణ వాతావరణాన్ని తగ్గిస్తారని, ఆగ్నేయ అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్‌ను ఎదుర్కోవడంలో తమ సహచరులు ట్రంప్, కమల సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఈ చర్చలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడికి మద్దతునిస్తారా? అనే ప్రశ్న టిమ్ వాల్జ్‌ను అడగ్గా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అని విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచం అస్థిరంగా ఉందని అన్నారు. దేశానికి దృఢమైన నాయకత్వం ముఖ్యమని తెలిపారు. కొన్నివారాల క్రితం జరిగిన ఓ చర్చా వేదికలో 80 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ తన సభకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వస్తున్నారని చెప్పారని, అది దేశానికి ప్రస్తుతం అవసరం లేదని డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ వ్యాఖ్యానించారు. అందుకు వాన్స్ సైతం ధీటుగా సమాధానమిచ్చారు. ట్రంప్‌ను భయపెట్టే వ్యక్తిగా అభివర్ణించారు. అలాగే ట్రంప్ దృఢమైన నాయకుడని పేర్కొన్నారు.
ఇరునేతల కరచాలనం
సీబీస్ న్యూస్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షుల మధ్య చర్చ దేశ భద్రత, ప్రపంచదేశాల్లో నెలకొన్న ఘర్షణలపై మొదలైంది. డిబేట్‌కు ముందు వాన్స్, వాల్జ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అలాగే ఇరువురు నేతలు హెలెన్ హరికేన్పై ఐక్యరాగాన్ని ఆలపించారు. తుపాను విధ్వంసం గురించి టిమ్ వాల్జ్ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న గవర్నర్లతో కలిసి పనిచేయాలని సూచించారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు ఉండకూడదని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమాయక ప్రజల కోసం పనిచేయడంలో టిమ్ వాల్జ్ నాతో కలిసి పనిచేస్తారని అనుకుంటున్నారని వాన్స్ తెలిపారు.
టిమ్ వాజ్ ప్రస్థానం
నెబ్రాస్కా రాష్ట్రంలోని చిన్న పట్టణంలో వాల్జ్ పుట్టి, పెరిగారు. రాజకీయాల్లోకి రాకముందు సోషల్ టీచర్‌గా, ఫుట్ బాల్ కోచ్‌గా పని చేశారు. 24 ఏళ్లపాటు మిలిటరీలో సేవలందించారు. 2006 నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున చురుగ్గా పనిచేస్తున్నారు. 2018లో మిన్నెసోటా గవర్నర్‌గా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
జేడీ వాన్స్ ప్రస్థానం
జేడీ మొదట్లో రిపబ్లికన్ పార్టీలో ఉంటూనే ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శించేవారు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఫిట్కారని కామెంట్స్ చేసేవారు. కొన్నేళ్ల క్రితం ఆకస్మిక మార్పుతో ట్రంప్ విధేయుడిగా జేడీ వాన్స్ మారిపోయారు. జేడీ వాన్స్ మంచి రచయిత. ఆయన రాసిన 'హిల్ బిల్లీ ఎలెజీ' పుస్తకం బాగా అమ్ముడుపోయింది. కాగా, జేడీ వాన్స్ ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్నారు.