PM Modi And UK PM Starmer Meet : బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాల అధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్య, నీరవ్ మోదీలను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో జరిగిన సమావేశంలో మోదీ కోరారు. వారితో పాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్ భండారీని కూడా భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
తప్పుడు ఎల్‌వోయూలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నీరవ్ మోదీ మోసగించిన వైనం 2018లో వెలుగుచూసింది. ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. 2018 డిసెంబర్‌లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు ఈ ఏడాది బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తనను భారత్‌కు అప్పగించే విషయాన్ని సవాలు చేస్తూ నీరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టివేసింది.
మరోవైపు విజయ్ మాల్య భారత్‌లో రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశారు. ఈ కేసులో సీబీఐ ముంబయిలోని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం లిక్కర్ కింగ్ విదేశాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత భారత్‌ను వీడి అతడు పారిపోయినట్లు తెలిపింది.
ఈ ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో బ్రిటన్ ప్రభుత్వం తొలి నుంచి సానుకూల వ్యాఖ్యలే చేస్తోంది. వారిని అప్పగించేందుకు అక్కడి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ క్లిష్టతరంగా మారుతోంది. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు భారత్‌లో విచారణ ఎదుర్కోవాలని తాము కూడా కోరుకుంటున్నామని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గతంలోనే స్పష్టంచేశారు. భారత్ నుంచి ప్రతిభ గల వ్యక్తులు రావడానికి తామెప్పుడూ ఆహ్వానం పలుకుతామని, అదే సమయంలో తమ న్యాయవ్యవస్థను ఉపయోగించుకొని భారతీయ చట్టాల నుంచి తప్పించుకోవాలనుకునే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.