Russia Ukraine War 1000 Days : 21వ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన పోరుగా నిలిచిన రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మంగళవారంతో 1000వ రోజుకు చేరుకుంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఐరోపాలో చోటుచేసుకున్న అత్యంత భీకరమైన ఘర్షణ ఇదే. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు చేపట్టిన సైనిక చర్య ఆ దేశంలో భారీ వినాశనానికి దారితీసింది. పరస్పర దాడులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లో ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధం ఊహకు అందని విషాదాన్ని మిగిల్చింది.
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 80వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఈ పోరులో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 లక్షల మంది గాయపడ్డారు. రష్యా వైపు బలగాల పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. పశ్చిమదేశాల నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 4 లక్షల మంది వరకు బలగాలు గాయపడినట్లు సమాచారం. ఇక ఉక్రెయిన్ జనాభాలో కోటిమంది తగ్గారు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 25 శాతం కావడం గమనార్హం. ఈ సుదీర్ఘ సంఘర్షణ కారణంగా గతేడాది డిసెంబరు నాటికి ఉక్రెయిన్ 152 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఆ దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంకు, ఐరోపా కమిషన్, ఐరాస అంచనా వేశాయి.
11 వేల మంది పౌరులు మృతి
ఉక్రెయిన్‌లోని ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం, 2024 ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్ వైపు కనీసం 11,743 మంది పౌరులు యుద్ధంలో మృతి చెందినట్లు అంచనా. మరో 24,600 మంది గాయపడ్డారు. పౌరుల మరణాల సంఖ్య అంచనాల కంటే చాలా రెట్లు ఎక్కువే ఉండొచ్చని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలు రష్యా అధీనంలో ఉండటం వల్ల అక్కడి బాధితులను తాము గుర్తించలేకపోతున్నామని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 14 నాటికి 589 మంది ఉక్రెయిన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు దారుణంగా తగ్గిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. దాదాపు 40లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి దేశంలోని మరో ప్రాంతానికి తరలివెళ్లాల్సి వచ్చింది. 60లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.
ఐదో వంతు భూభాగాన్ని ఆక్రమించుకున్న రష్యా
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా ఆ దేశానికి చెందిన ఐదో వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇది గ్రీస్ దేశ విస్తీర్ణంతో సమానం. 2022లో ఉక్రెయిన్‌ను మూడువైపులా చుట్టుముట్టిన రష్యా ఒక దశలో రాజధాని కీవ్ శివార్లకు చేరుకుంది. ఉక్రెయిన్ తూర్పున ఉన్న డాన్‌బాస్ ప్రాంతం మొత్తాన్ని రష్యా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. రష్యా దాడుల్లో ఫ్రంట్‌లైన్‌లో ఉన్న అనేక ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్‌లో విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేసింది. భారీ నష్టాన్ని కలిగించింది. అనేక మౌలిక వసతులను నామరూపాల్లేకుండా చేసింది. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా నిలిచి ఒకానొక దశలో ప్రపంచంలో ఆహార సంక్షోభానికి కారణమైంది. ఒకరోజు యుద్ధానికి ఉక్రెయిన్‌కు 140 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నట్లు అంచనా.
పశ్చిమ దేశాల ఆర్థిక సాయం
ఉక్రెయిన్ పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం దాదాపు 486 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్ ప్రభుత్వం గతేడాది డిసెంబరులోనే అంచనా వేసింది. కీవ్ సాధారణ జీడీపీతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. రక్షణ రంగం కోసం దాదాపు 53.3 బిలియన్ డాలర్లను వెచ్చించాలని ఇటీవల 2025 బడ్జెట్ అంచనాల్లో ఉక్రెయిన్ పేర్కొంది. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు భారీగా సైనిక, ఆర్థికసాయాన్ని అందించాయి. ఇప్పటివరకు కీవ్ 100 బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందుకున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.
మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అంతకంతకూ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో వేలాది ఉత్తరకొరియా సైనికులను రష్యా రంగంలోకి దింపింది. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిఇచ్చింది. అమెరికా నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధంవైపు నెడుతుందని ఇప్పటికే రష్యా హెచ్చరించింది