Indian Railways 1000 New General Coaches : అతి తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం దొరుకుతందని ప్రజలు రైల్వే ప్రయాణానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ గత కొద్ది కాలంగా సీట్ల కొరత, రిజర్వేషన్‌కు భారీగా వెయిటింగ్ ఉండడం వల్ల చాలా మంది రైల్వే ప్రయాణానికి దూరమవుతున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు రైల్వే శాఖ ఓ శుభవార్త వినిపించింది. ఇకపై ప్రయాణికులకు జనరల్ బోగీలో సీట్ల కొరతను తగ్గించే దిశగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.
1000 కొత్త బోగీలు - దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సేవలందిస్తోన్న రైళ్లకు కొత్త జనరల్ బోగీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంది రైల్వే శాఖ. ఇందులో భాగంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియ నవంబర్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని రైల్వే బోర్డు తెలిపింది.
ఈ బోగీల ద్వారా ప్రతీ రోజు అదనంగా లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని వెల్లడించింది. పలు రైళ్లకు ఇప్పటికే 583 జనరల్ కోచ్‌లను అమర్చినట్లు తెలిపిన రైల్వే శాఖ, మిగతా రైళ్లకు కూడా వీటిని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
ఆ పండగ దృష్టిలో పెట్టుకుని - దేశంలోని అన్ని రైల్వే జోన్‌లు, డివిజన్లలో ఈ కోచ్‌లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని రైల్వే బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి ఇది పూర్తవుతుందని సదరు అధికారి పేర్కొన్నారు. 2025లో హోలీ పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సన్నాహాలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
10,000 నాన్-ఏసీ కోచ్‌ల తయారీ - రాబోయే 2 ఏళ్లలో 10,000 నాన్-ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కూడా తెలిపిన సదరు అధికారి, దీని ద్వారా ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అన్నారు. ఈ కొత్త కోచ్‌ల తయారీ చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోందని రైల్వే శాఖ పేర్కొంది. అధునాతన సౌకర్యాలతో పాటు భద్రతా ప్రమాణాలతో ఈ 10 వేల నాన్ ఏసీ కోచ్‌లను రూపొందించినట్టు రైల్వే బోర్డు వెల్లడించింది.
దిల్లీ కాలుష్యం ఎఫెక్ట్ - వర్చువల్‌గానే జడ్జీల వాదనలు
గోద్రా అల్లర్ల విషయంలో నిజం బయటకు వస్తోంది - ఆ మూవీ భలే తీశారు: ప్రధాని మోదీ