Ukraine Attack On Russia : రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న పోరు మరింత ఉద్రిక్తం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు అమెరికా అనుమతి ఇచ్చిన రోజు వ్యవధిలో రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. అమెరికా తయారు చేసిన ATACMS క్షిపణులను రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ ప్రయోగించింది. బ్రియాన్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ 6 ATACMS మిసైళ్లతో దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది. వాటిలో 5 మిసైళ్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఒక క్షిపణి మాత్రం బ్రియాన్స్క్ ప్రాంతంలోని సైనిక స్థావరంపై పడిందని, దాంతో మంటలు చెలరేగినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. సహాయక సిబ్బంది మంటలను ఆర్పివేసినట్లు పేర్కొంది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వివరించింది. ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఇంతకు ముందు కరాచెవ్‌లోని లాజిస్టిక్స్ సపోర్ట్ సెంటర్‌పై కూడా తమ బలగాలు దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. లక్షిత ప్రాంతాల్లో అనేక పేలుడు శబ్దాలు వినిపించాయని వెల్లడించింది.
అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా సిద్ధం!
దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పుతిన్ అప్రమత్తం అయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా సవరించిన కొత్త అణు సిద్ధాంతాల దస్త్రంపై సంతకం చేశారు. దీనితో రష్యా ఏ క్షణమైనా అణ్వాధాయులను ప్రయోగించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి.
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో వేలాది ఉత్తర కొరియా సైనికులను రష్యా రంగంలోకి దింపింది. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిఇచ్చింది. అమెరికా నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధంవైపు నెడుతుందని ఇప్పటికే రష్యా గట్టిగా హెచ్చరించింది. తాజాగా దీనికి ఆజ్యం పోస్తూ రష్యా తన అణ్వాయుధ ప్రయోగ నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీనితో ఎప్పుడు ఏమౌతుందో అనే ఆందోళనలు చెలరేగుతున్నాయి.