Putin Nuclear Weapons : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధం అణు యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పరిస్థితులను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. అమెరికా నిర్ణయంతో గుర్రుగా ఉన్న రష్యా తమ అణు సిద్ధాంతాలను తాజాగా సవరించింది. సవరించిన కొత్త అణు సిద్ధాంతాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా ఏ క్షణమైనా అణ్వాధాయులను ప్రయోగించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి.
1000 రోజుల యుద్ధం - ఇంకా పూర్తి కాలేదు!
ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలుపెట్టి 1000 రోజులు పూర్తయిన వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే, దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. తాము అందించే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన వేళ పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాలు ఆమోదం తెలిపితే - నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంతకు ముందే పేర్కొన్నారు. నాటో సైనిక, సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకొని తాము కూడా దాడులు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తన అణు విధానానికి సవరణలు చేసిన రష్యా, తాజాగా దానిని మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకంది. ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే, అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం.
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో వేలాది ఉత్తరకొరియా సైనికులను రష్యా రంగంలోకి దింపింది. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిఇచ్చింది. అమెరికా నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధంవైపు నెడుతుందని ఇప్పటికే రష్యా హెచ్చరించింది. తాజాగా దీనికి ఆజ్యం పోస్తూ రష్యా తన అణ్వాయుధ ప్రయోగ నిబంధనలను మరింత సరళతరం చేసింది.