Trump Deportation Exercise : ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు వాషింగ్టన్ వేదికగా నిర్వహించిన 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' (మాగా) విజయోత్సవ ర్యాలీలో కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతానని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపుతానన్నారు.
త్వరలోనే అక్రమ వలసదారులపై కొరడా!
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా, త్వరలోనే భారీగా అక్రమ వలసదారులను స్వదేశాలకు తిప్పి పంపే కార్యక్రమాన్ని మొదలుపెడతామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్ టాక్‌ను కాపాడతామని ఆయన వెల్లడించారు. దేశంలో ఉద్యోగాల కోతను ఆపేందుకు టిక్‌టాక్‌ను గట్టెక్కిస్తానని తెలిపారు. అమెరికాలో జరిగే వ్యాపారాన్ని చైనాకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అమెరికాలోని టిక్ టాక్ వ్యాపారంలో 50 శాతం వాటాను అమెరికా కంపెనీకి ఇస్తే దాని కార్యకలాపాలకు అనుమతిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. "నేను టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని కాపాడేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేస్తాను. ఆ కంపెనీని అమెరికా సంస్థకు విక్రయించేందుకు మరింత గడువు ఇస్తాను" అని ఆయన తెలిపారు.
అమెరికాను మళ్లీ పైకితెస్తాం
"గత నాలుగేళ్లుగా అమెరికా క్షీణతను చూసింది. ఆ క్షీణ దశకు ఇప్పుడు తెరపడింది. ఇక మేం అమెరికాను మళ్లీ పైకి తెస్తాం. ఎందుకంటే మేం గెలిచాం" అని ట్రంప్ తెలిపారు. దేశంలోని అవినీతిమయ రాజకీయ వ్యవస్థను అంతం చేస్తామన్నారు. "అమెరికా ఎన్నికల ఫలితాలను చూసి అందరూ ట్రంప్ ఎఫెక్ట్ అన్నారు. కానీ ఇది వాస్తవానికి మీ(ప్రజల) ఎఫెక్ట్" అని ఆయన తెలిపారు. "అమెరికాపై విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంచేలా స్కూళ్లను మారుస్తాం" అని చెప్పారు.