Panama Canal Controversy :పనామా కాలువ తమదేనంటూ కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండటంపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ములినో ట్రంప్ చెప్పిందంతా అవాస్తవమన్నారు. పనామా కెనాల్ అమెరికా నుంచి తమకు రాయితీగానో.. బహుమతిగానో వచ్చింది కాదని పేర్కొన్నారు. పనామా కెనాల్ తమకు మాత్రమే సొంతమని ములినో తేల్చి చెప్పారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించమని పనామా ప్రజలు చెబుతున్నారు. పనామా కెనాల్ తమలో భాగమని స్పష్టం చేశారు.
"పనామా పౌరులుగా, మేము నిరాశకు గురవుతున్నాం. కానీ అదే సమయంలో కాలువ మాది అని నేను భావిస్తున్నాను, నమ్ముతాను. మాకు స్వేచ్ఛ అవసరం కాబట్టి మేము అమెరికా నుంచి స్వాతంత్ర్యం పొందాం. ఈ కెనాల్ మా భూమిపై ఉంది కనుక ఇది మాలో భాగం"
- విల్లా మోంటే, పనామా జాతీయురాలు
"వాస్తవమేంటంటే ఈ కెనాల్ ట్రంప్ చెబుతున్నట్లు అమెరికాది కాదు. ఇది పనామా ప్రజలది. అమెరికాది కానే కాదు. అందుకే మేము ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించం. అయినా ట్రంప్ నిరంతరంగా ఆ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు"
- జోష్, పనామా జాతీయుడు
సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని మరోసారి ఆరోపించారు. ఆ కెనాల్‌ను అమెరికా చైనాకు ఇవ్వలేదని పనామాకు ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా ములినో ఘాటుగా స్పందించారు. అంతేగాక, ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని చెప్పారు.
పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబరులో దీన్ని పనామాకు ఇచ్చింది. అమెరికా వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడం వల్ల రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది.