UK General Elections 2024 : బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్ తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు సునాక్ తెలిపారు. లండన్‌లో జోరుగా వర్షం కురుస్తున్నవేళ తన అధికారిక నివాసమైన '10 డౌనింగ్ స్ట్రీట్' మెట్లపై నిలబడి తడుస్తూనే ఆయన ప్రసంగించారు.
బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని సునాక్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా తన హయాంలో సాధించిన విజయాలను సునాక్ గుర్తుచేశారు. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. దేశాధినేతతో మాట్లాడానని, పార్లమెంటును రద్దు చేయమని అభ్యర్థించానని చెప్పారు. ఇందుకు రాజు అనుమతించడం వల్ల జులై 4న ఎన్నికలు జరగనున్నాయని పేర్కొన్నారు.
'ప్రాన్స్, జర్మనీ, అమెరికా కంటే మెరుగ్గా'
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుగా ఉందని ప్రధాని సునాక్ తెలిపారు. 'మన ఆర్థిక వ్యవస్థ ప్రాన్స్, జర్మనీ, యూఎస్ కంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే ద్రవ్యల్బణం కూడా సాధారణ స్థితి చేరుకుందనే శుభవార్తను విన్నా. ఇది మన ప్రభుత్వ ప్రణాళికలు, ప్రయత్నాలు పనిచేస్తున్నాయని చెప్పడానికి సంకేతం. కష్టపడి సాధించిన ఈ ఆర్థిక స్థిరత్వం ప్రారంభం కావాలనే ఉద్దేశంతో నేను ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చాను. తద్వారా మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోవచ్చు. సంతోషంగా గడిపే రోజులు భవిష్యత్తులో వస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ ప్రణాళికలకు కట్టుబడి ఉంటే ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు ఉంటాయి. నేను దేశ ప్రజల రక్షణ కోసం కష్టపడి పని చేస్తా' అని రిషి సునాక్ ఎక్స్ వేదికగా తెలిపారు.