Trump Slams Kamala Harris : దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్ అని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమొక్రటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన అనంతరం ఆయన ఇలా తీవ్రంగా స్పందించారు. కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఆమెను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
"అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ తగిన వ్యక్తి కాదు. ఆ హోదాలో పనిచేసే అర్హత అతడికి ఏనాడూ లేదు. బైడెన్ కేవలం అబద్ధాలు, తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారా అధ్యక్ష పదవిని పొందారు. మీడియా, వైద్యులు సహా చుట్టూ ఉన్న అందరికీ ఆయన అధ్యక్ష హోదాలో ఉండడానికి అర్హుడు కాదని స్పష్టంగా తెలుసు. ఆయన పాలన వల్ల మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. కానీ వాటిని వీలైనంత త్వరగా మనం చక్కబెడదాం" అని ట్రంప్ అన్నారు.
కమలా హారిస్‌ను సులువుగా ఓడిస్తా!
బైడెన్ స్వయంగా కమలా హారిస్‌కు మద్దతు తెలిపిన నేపథ్యంలో, ట్రంప్ ఆమెపై కూడా సునిశిత విమర్శలు చేశారు. బైడెన్ కంటే కమలా హారిస్‌ను ఓడించడం ఇంకా సులభమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బైడెన్ కంటే కూడా ఆమె మరింత బలహీనమైన వ్యక్తి అని విమర్శించారు. ఆమెకు అప్పగించిన సరిహద్దు సమస్యకు ఏమాత్రం పరిష్కారం చేయలేకపోయారని దుయ్యబట్టారు.