Russia Ukraine War :ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలై నేటికి మూడేళ్లు అవుతోంది. 36 నెలలుగా ఇరుదేశాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరువైపుల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజల కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపింది. అనేక మంది డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
విలయతాండవం
రష్యా, ఉక్రెయిన్ అధునాతన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా మృత్యువు విలయతాండవం చేస్తోంది. వేలాది మంది అమాయక ప్రజలు అసువులు బాశారు. ఇరువైపుల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. ఈ యుద్ధంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ఆర్థికంగా, సైనికంగా చితికిపోయినా రష్యాకు తలవంచకుండా అస్థిత్వమే లక్ష్యంగా ఉక్రెయిన్ పోరాడుతోంది. పవర్‌హౌస్ రష్యాను నిలువరించేందుకు మిత్ర దేశాల సాయంతో ఉక్రెయిన్ తన సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది.
భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
యుద్ధం కారణంగా ఉక్రెయిన్ భారీ ఆస్తి, ప్రాణ నష్టం చవిచూసింది. అధికారిక లెక్కలు తెలియకపోయినా, ఈ మూడేళ్లలో ఇరువైపులా సుమారు 2 లక్షల మంది మరణించినట్లు ఓ అంచనా. ఈ పోరు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఉక్రెయిన్‌లో జీవన వ్యయాన్ని భారీగా పెంచింది. అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. ఎన్నో రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ ఏడాది జనవరి నాటికి ఉక్రెయిన్‌లో ద్రవ్యోల్బణం 13 శాతానికి పెరిగింది. మౌలిక సదుపాయాలకు దాదాపు 170 బిలియన్ యూఎస్ డాలర్ల ప్రత్యక్ష నష్టం జరిగినట్లు కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తెలిపింది. 2022లో యుద్ధం మొదలైన రోజు నుంచి ఉక్రెయిన్‌లో వందల సంఖ్యలో కంపెనీలు నష్టపోయాయని పేర్కొంది. ముఖ్యంగా ఉక్రెయిన్ ఆదాయానికి కీలక వనరుగా ఉన్న మెటలర్జికల్ పరిశ్రమ రంగం భారీగా నష్టాన్ని చూసింది. ఇప్పుడు ఈ రంగాన్ని పునరుద్ధరించడం అసాధ్యంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది.