Telegram CEO 100 Kids : పావెల్ దురోవ్‌పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. మనలో చాలామంది నిత్యం వినియోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' వ్యవస్థాపకుల్లో ఒకరు. ప్రస్తుతం ఆ కంపెనీ సీఈవోగా పావెల్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన టెలిగ్రామ్‌లో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. 12 దేశాల్లోని 100 మందికిపైగా పిల్లలకు తాను బయోలాజికల్‌గా తండ్రినని పేర్కొంటూ టెలిగ్రామ్‌లో పావెల్ ఒక సుదీర్ఘ మెసేజ్ రాసుకొచ్చారు. ఇప్పుడు దానిపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది.
సాయం చేయమన్నస్నేహితుడు!
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. ఆయన వద్ద దాదాపు రూ.129 కోట్ల సంపద ఉంది. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ 100 మందికిపైగా సంతానాన్ని పొందారు. ఇంతకీ ఎలా అనేది ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇతరులకు వీర్యదానం చేయడం ద్వారా అంతమంది పిల్లలకు తాను తండ్రిని అయ్యానని పావెల్ తెలిపారు. '15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నన్ను కలిసి వింత సాయం కోరాడు. వారికి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం వల్ల నన్ను వీర్యదానం చేయమని కోరాడు. ఆ సంఘటనతో సంతానలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు మరింత అర్థమైంది' అని పావెల్ పేర్కొన్నారు.
వీర్యాన్ని దానం చేసి సంతానం లేని దంపతులకు సాయం చేయడం సామాజిక బాధ్యత అని ఓ డాక్టర్ చెప్పిన మాటల నుంచి తనకు స్ఫూర్తి లభించిందని పావెల్ దురోవ్ అన్నారు. ఆ తర్వాతే తాను స్పెర్మ్ డొనేషన్‌లో రిజిస్టర్ చేసుకున్నట్లు టెలిగ్రామ్ సీఈవో చెప్పారు. ఇప్పటిదాకా 12 దేశాల్లో వందమందికిపైగా జంటలకు తాను సంతానాన్ని అందించినట్లు తెలిపారు. 'వాస్తవానికి కొన్నేళ్ల కిందటే నేను వీర్యదానాన్ని ఆపేశాను. అయితే ఫ్రీజ్ చేసిన నా వీర్య కణాలతో ఒక ఐవీఎఫ్ క్లినిక్ వాళ్లు ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారు' అని పావెల్ దురోవ్ వివరించారు.