తెలంగాణ

telangana

ETV Bharat / international

నాకిదే హ్యాపీ ప్లేస్- అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్ - Sunita Williams In Space 2024 - SUNITA WILLIAMS IN SPACE 2024

Sunita Williams In Space 2024 : అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, విల్‌మోర్ అక్కడి నుంచే అమెరికా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో ఎక్కువకాలం గడపడం కష్టమే అయినప్పటికీ, ఇది తనకు హ్యాపీ ప్లేస్‌ అని సునీత వెల్లడించారు.

Sunita Williams In Space 2024
Sunita Williams In Space 2024 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 10:01 AM IST

Sunita Williams In Space 2024 :బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు.

ఓటు మా బాధ్యత!
"బ్యాలెట్‌ కోసం మా అభ్యర్థనను కిందకు పంపించాం. అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం మా కీలక కర్తవ్యం. మా విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుంది" అని విల్‌మోర్‌ వెల్లడించారు. అనంతరం సునీత మాట్లాడారు. "ఓటు మా బాధ్యత. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నా" అని ఆనందం వ్యక్తం చేశారు.

మా విధుల్లో భాగంగానే!
"బోయింగ్‌ మమ్మల్ని విడిచివెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తోంది. దీంతో మరికొన్ని నెలలు కక్ష్యలోనే గడపాల్సి ఉంది. అయినా, అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉంది. ఇదంతా మా విధుల్లో భాగంగానే భావిస్తున్నాం" అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులను మిస్‌ అవుతున్నప్పటికీ ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురిచేయడం లేదని విల్‌మోర్ వ్యాఖ్యానించారు.

బోయింగ్‌ క్రూ ఫ్లైట్‌ టెస్ట్‌లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ ఈ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో జూన్‌ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తాయి. హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.

దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్‌ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్‌ సురక్షితమే అని చెప్పింది. కానీ, నాసా మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌లైనర్‌ న్యూ మెక్సికోలోని వైట్‌ శాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌లో సురక్షితంగా కిందకు దిగింది. వచ్చే ఏడాది స్పేస్ఎక్స్ వ్యోముగాములను తీసుకురానుంది.

ABOUT THE AUTHOR

...view details